Stake Sale LIC 2025: మరోసారి ప్రభుత్వరంగ జీవిత బీమా దిగ్గజం అయిన ఎల్ఐసి (Life Insurance Corporation of India) లో వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈసారి సర్కారు ఎల్ఐసీలో సుమారు 6.5 శాతం విక్రయించనుంది. ప్రస్తుతం ప్రభుత్వం LICలో 96.5% వాటాను కలిగి ఉంది. 2022 మేలో జరిగిన IPO ద్వారా 3.5% వాటాను విక్రయించి రూ.21,000 కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడు ఒఎఫ్ఎస్ (Offer For Sale) ద్వారా మరో 6.5% అమ్మకం చేయాలని నిర్ణయించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం 2027 మే 16నాటికి కనీసం 10 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనను నెరవేర్చడమే.
అమ్మక వ్యూహం
ప్రభుత్వం 6.5 శాతం వాటాను ఒకేసారి కాకుండా దశల వారీగా 24 నెలల వ్యవధిలో విక్రయించాలన్న వ్యూహం పై పని చేస్తోంది. అమ్మక సమయం మార్కెట్ స్థిరత్వాన్ని బట్టి నిర్ణయించనుంది. ప్రస్తుతం ఎల్ఐసి షేర్లు రూ.924–930 మధ్య ట్రేడవుతుండటంతో, ఒఎఫ్ఎస్ తో కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది లేదా మార్కెట్ టార్గెట్ ఆధారంగా ప్రీమియం లభించవచ్చు. ఈ అమ్మకం ద్వారా కేంద్రం రూ.1.2–1.5 లక్ష కోట్ల మార్కెట్ విలువలో 6.5 శాతం షేర్‌ను విక్రయించడంతో భారీ ఆదాయం పొందే అవకాశముంది. ఇది ద్రవ్య లోటు తగ్గించడంలో ఉపకరిస్తుంది.
ఎలాంటి ప్రభావం
ఈ డివెస్ట్‌మెంట్ ద్వారా ప్రజా వాటా 10% కి చేరడం వల్ల LIC షేరు లిక్విడిటీ పెరుగుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం తన బడ్జెట్ లో భాగంగా మరిన్ని నిధులు సమీకరించగలదు. అయితే మార్కెట్లో పడిపోయే పరిస్థితులలో షేరు అమ్మకానికి నిరుత్సాహం ఏర్పడవచ్చు. అలాగే ప్రస్తుత ధరలకు లభించదగిన ప్రీమియం లేకపోవడం వల్ల అమ్మకం ఆలస్యపడే అవకాశం ఉంది.
మార్కెట్ పరిస్థితులు
ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉంది. ప్రభుత్వ సంస్థ డిపామ్ (DIPAM) మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అమ్మకం పరిమాణం, ధర, సమయాన్ని నిర్ణయించనుంది. LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.85 – రూ.5.97 లక్ష కోట్ల మధ్యగా ఉంది. షేర్ల ధర BSEలో రూ.924–930 మధ్య ట్రేడవుతోంది. ఇటీవల షేర్ -2.27 శాతం తగ్గింది. జూన్ 2025లో ఎల్ఐసి వ్యక్తిగత ప్రీమియంలో 14.6 శాతం వృద్ధి నమోదు చేసింది, ఇది ప్రైవేట్ బీమా కంపెనీల కంటే మెరుగైనది. మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.19,039 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది 73 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
ఇక విశ్లేషకులు LICపై బలమైన “BUY” సూచన ఇస్తున్నారు. ICICI Securities రూ.1,040 టార్గెట్ సెట్ చేయగా, S&P గ్లోబల్ ₹1,072 టార్గెట్ తెలిపింది. ఇది షేర్లకు 13–16 శాతం అప్‌సైడ్ సూచన.
ఎల్ఐసి 1956లో స్థాపించినప్పటి నుంచి భారత ఫైనాన్షియల్ రంగంలో అతి విశ్వసనీయ సంస్థగా పేరొందింది. 2024 చివరిలో రూ.17700 కోట్ల లాభాలు ప్రకటించగా, అప్పటి నుండి షేర్లు 5-6 శాతం తగ్గాయి. అయినా దీర్ఘకాలికంగా మంచి పనితీరు, బలమైన ప్రీమియం వృద్ధి రేట్ల కారణంగా LICపై ఇన్వెస్టర్లు నమ్మంతో ఉన్నారు.


