X (Twitter) CEO Resigns: ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ X (ట్విట్టర్)కు సీఈఓ లిండా యాక్కరీనో షాక్ ఇచ్చారు. 2023లో CEOగా నియమితులైన లిండా యాక్కరీనో జూలై 9న తన పదవికి రాజీనామా చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆమె తన అధికారిక ప్రకటనలో “ఇది అద్భుతమైన రెండు సంవత్సరాల ప్రయాణం. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చింది” అంటూ ట్వీట్ చేశారు. యాక్కరీనో రాజీనామాపై స్పందించిన ఎలాన్ మస్క్ “మీ సేవలకు నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు. దీనితో యాప్‌కు కొత్త సీఈఓ ఎవరన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. మస్క్ ఇప్పటికే సిటిఒ, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆయనే బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
రెండు సంవత్సరాల ప్రయాణం
లిండా యాక్కరీనో 2023లో NBCUniversal నుంచి X కు చేరారు. ఆమెకు మీడియా మరియు ప్రకటనల రంగంలో విశేష అనుభవం ఉంది. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాప్ ప్రకటన ఆదాయాన్ని తిరిగి నిలపడం, గ్లోబల్ బ్రాండ్ల విశ్వాసాన్ని పెంపొందించడం ఆమె ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి. అయితే ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎలాన్ మస్క్ తన వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో పడగా, ముఖ్యమైన బ్రాండ్లు X ను బహిష్కరించాయి. దీంతో కంపెనీ ప్రకటనల ఆదాయంలో తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయంలో యాక్కరీనోకు ఎదురైన ఒత్తిళ్లు అంతా ఇంతా కాదు.
AI బ్లండర్.. Grok వివాదం
2025లో X AI చాట్‌బాట్ “Grok” విపరీతమైన స్పందనతో ప్రారంభమైనా, extremist కంటెంట్‌ను ప్రచురించడాన్ని అడ్డుకోలేకపోయింది. ఇది యాప్ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్రంగా దెబ్బతీసింది. వినియోగదారుల్లో ఆగ్రహం పెరిగింది. ఈ అంశం కూడా యాక్కరీనో పదవి నుంచి తప్పుకునేందుకు ఒక ప్రధాన కారణమై ఉండే అవకాశం ఉంది.
నాయకత్వ మార్పు
ఇప్పటికి కొత్త CEO ఎవరన్నది ప్రకటించలేదు. కానీ యాక్కరీనో రాజీనామా ఒక ముందుగానే నిర్ణయించిన కార్యాచరణలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం టెస్లా, స్పేస్‌ఎక్స్, గ్రోక్ లాంటి ఎలాన్ మస్క్ సంస్థల్లోనూ భిన్నమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో ఎక్స్ లో లీడర్‌షిప్ లో స్థిరత్వం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ బిజినెస్ అనలిస్టులు వ్యాఖ్యానిస్తూ, లిండా యాక్కరీనో మస్క్ పోస్ట్-అక్విజిషన్ స్టెబిలిటీకి చిహ్నంగా నియమితులయ్యారు. కానీ చివరికి ఆమె తనకు ఇచ్చిన స్వేచ్ఛను పూర్తిగా వినియోగించలేకపోయారు. బ్రాండ్ పరిరక్షణలోను, వ్యాపార ప్రగతిలోనూ ఆమె కృషిని చిన్నచూపు చూడలేమని అన్నారు. ఎక్స్ సంస్థ ఇప్పుడు మరో మలుపులోకి వచ్చింది. మస్క్ తన వ్యూహాలను మరింత బలంగా అమలు చేయాలనుకుంటున్న నేపథ్యంలో సంస్థ దిశ ఎలా మారుతుంది అనేది చూడాలి.


