Crypto Assets Legality: ఇటీవలి కాలంలో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న పెద్ద రంగాల్లో ఒకటి క్రిప్టోకరెన్సీలు. వాటిలో బిట్‌కాయిన్ అనే పేరు చాలా మందికి సుపరిచితం. పెట్టుబడుల రూపంలో లాభాలు తెస్తున్నా.. భారత చట్టాలు ఈ డిజిటల్ కరెన్సీలను ఆస్తిగా గుర్తిస్తాయా? అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే ఇటీవల వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఈ సందేహాలకు స్పష్టతను తీసుకువచ్చాయి.
అక్టోబర్ 25న మద్రాస్ హైకోర్టు రూతికుమారి వర్సెస్ జాన్మై ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ఇచ్చిన తీర్పు దేశంలో డిజిటల్ ఆస్తులపై పెరుగుతున్న న్యాయ అవగాహనలో కీలక ఘట్టంగా నిలిచింది. ఈ తీర్పులో కోర్టు క్రిప్టోకరెన్సీలు చట్టబద్ధ లీగల్ టెండర్ కాదు అయినప్పటికీ, అవి భారత చట్టం ప్రకారం ఆస్తిగా పరిగణించవచ్చని ప్రకటించింది. ప్రజలు వాటిని వర్చువల్ రూపంలో కలిగి ఉండటానికి, వాటిని తమ డిజిటల్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉంచుకునే హక్కు కలిగినవారని కోర్టు గుర్తించింది.
కోర్టు తీర్పు ప్రకారం.. క్రిప్టో ఆస్తులు భౌతిక రూపంలో లేనప్పటికీ వాటికి విలువ ఉంది. ఆ విలువను సంరక్షించడం, పెట్టుబడిదారుల హక్కులను కాపాడటం ఎక్స్చేంజీల బాధ్యత అని స్పష్టం చేసింది. ఎక్స్చేంజీలు కేవలం రక్షకులుగా వ్యవహరించాలి, కానీ వాటి ఆస్తులను రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌ల కింద వినియోగించడం అసాధ్యం అని కోర్టు పేర్కొంది.
ఇదే దిశగా అక్టోబర్ 7న బాంబే హైకోర్టు విజిర్ఎక్స్ మరియు కాయిన్‌డీసీఎక్స్ కేసులో కూడా ఇలాగే తీర్పు ఇచ్చింది. కంపెనీలు నష్టపోయినా వినియోగదారుల క్రిప్టో ఆస్తులను పంచుకోవడం న్యాయ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. విజిర్ఎక్స్‌పై ఇటీవల జరిగిన సైబర్ దాడిలో 234 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలు దొంగిలించబడిన ఘటన ఈ చర్చకు బలాన్నిచ్చింది.
ఇలాంటి తీర్పులు క్రిప్టో మార్కెట్‌పై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజీ జియోటస్ ఈ తీర్పులను స్వాగతిస్తూ, ఇవి కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు భారత న్యాయవ్యవస్థ టెక్నాలజీ మార్పులను అర్థం చేసుకుంటోందని పేర్కొంది. జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ మాట్లాడుతూ కంపెనీ చట్టపరమైన నిబంధనలు పాటిస్తూనే పెట్టుబడిదారుల ఆస్తులను రక్షించేందుకు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్నారు.


