Discounts on Maruti Suzuki cars: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల దృష్ట్యా పలు కార్ల తయారీ సంస్థలు తమ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలను తగ్గించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్‌పై గరిష్ఠంగా రూ. 1.06 లక్షల వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. మరోవైపు, ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్‌పై రూ.55 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ కారు రూ.5.94 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులోకి రానుంది. ఇక, ఇతర మోడళ్ల విషయానికొస్తే.. కొత్త జీఎస్టీ ధరల ప్రకారం మారుతీ సుజుకీ ఆల్టో కే10 మోడల్‌పై గరిష్ఠంగా రూ.53 వేల వరకు తగ్గనుంది. దీని ఎంట్రీ లెవల్ మోడల్ ధర రూ.28 వేల తగ్గింపుతో రూ.3.87 లక్షలకు లభించనుంది. ఇక, హైఎండ్ వేరియంట్ ధర రూ.5.36 లక్షలుగా కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ధర రూ.3.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ కారుపై గరిష్ఠంగా రూ.53 వేలు అందిస్తోంది. మరోవైపు, దేశంలోనే అత్యంత పాపులర్ మోడల్ మారుతీ సుజుకీ వ్యాగనార్‌పై గరిష్ఠంగా రూ.64 వేల వరకు తగ్గనుంది. ఇక, సెలెరియో మోడల్‌పై రూ.63వేలు, డిజైర్ మోడల్‌పై రూ.87 వేల వరకు తగ్గనుంది. ఈ మోడల్ ధరలు రూ.6.24 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు, మారుతీ సుజుకీ బాలెనోపై గరిష్ఠంగా రూ.85 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.
Read Also: https://teluguprabha.net/technology-news/oppo-f31-series-specifications/
28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ..
కాగా, జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ రేట్లను 28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో, మధ్య తరగతి ప్రజలకు వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 28 శాతంతో పాటు 12 శాతం శ్లాబును కేంద్రం ఎత్తివేసింది. దీంతో చాలా వరకు చిన్న కార్లపై ధరలు తగ్గాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హోండా కార్స్, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఇలా అన్నీ కార్ల తయారీ సంస్థలు పలు మోడళ్లపై ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే దారిలో మారుతీ సుజుకీ సైతం పాపులర్ హ్యాచ్‌బాక్‌లపై ధరలు తగ్గించింది. ఈ నెల 22 నుంచి తగ్గించిన ధరలు అమలవుతాయని ఆయా కంపెనీలు స్పష్టం చేశాయి. ఓవైపు జీఎస్టీ ధరల తగ్గింపు, మరోవైపు పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ఈసారి ఆటోమొబైల్ షోరూమ్‌లు కలకళలాడనున్నాయి.


