Maruti Suzuki Car prices hike: మీరు బడ్జెట్ ధరలో ఓ కొత్త కారు కొనాలని చూస్తున్నారా?.. అయితే, వెంటనే కొనేయండి. ఎందుకంటే, దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కారు ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. మారుతీ సుజుకీ అన్ని మోడళ్లపై రూ. 30 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. జూన్ నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. గడిచిన కొద్ది నెలలుగా ఖర్చుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని, అనివార్య పరిస్థితుల్లో ధరలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, వినియోగదారులపై అధిక ప్రభావం పడకుండా కొంతమేర ధరలు పెంచుతున్నామని, కస్టమర్లు సహకరించాలని కోరింది.
Also read: Zepto IPO: రూ.11 వేల కోట్లతో జెప్టో ఐపీఓ.. ఒక్క షేరు ధరెంతో తెలుసా?
ఒక్కో మోడల్‌పై రూ. 30 వేల వరకు పెంపు..
కాగా, మారుతీ సుజుకీ ప్రస్తుతం ఎస్-ప్రెస్సో వంటి ఎంట్రీ లెవల్ మోడళ్ల నుంచి ప్రీమియం యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు వివిధ మోడళ్లను భారత మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.3.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.28.7 లక్షల వరకు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ 2.0 నిర్ణయం కారణంగా ఆయా కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఎస్-ప్రెస్సో రూ.1.29 లక్షలు, ఆల్టో కే10పై రూ.1.07 లక్షలు, సెలిరియో రూ.94వేలు, వ్యాగనార్‌పై రూ.79 వేల చొప్పున తగ్గాయి. తాజా పెంపు నిర్ణయంతో వాటి ధరలు గరిష్ఠంగా రూ.30 వేల వరకు పెరగనున్నాయి.

