car sales : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి అప్రతిహతమైన రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్‌లో ఏకంగా 3 కోట్ల కార్ల విక్రయాల మైలురాయిని దాటి, భారతీయ రోడ్లపై తమ ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.1983 డిసెంబర్‌లో మారుతీ 800తో మొదలైన ఈ ప్రయాణం, నాలుగు దశాబ్దాలలో కోట్లాది భారతీయుల ప్రయాణ అవసరాలను తీరుస్తూ వచ్చింది. అయితే, ఈ 3 కోట్ల మార్కును చేరుకోవడానికి పట్టిన సమయమే మారుతీ సాధించిన వేగాన్ని, భారత మార్కెట్ యొక్క పరిణామాన్ని స్పష్టం చేస్తుంది.
1983లో ప్రారంభించి, మొట్టమొదటి కోటి కార్ల అమ్మకాలకు మారుతీ సుజుకికి ఏకంగా 28 ఏళ్ల 2 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత రెండో కోటి మార్కును చేరుకోవడానికి పట్టిన సమయం కేవలం 7 ఏళ్ల 5 నెలలు. ఈ మూడో కోటి కార్ల విక్రయాల మార్కును చేరుకోవడానికి తీసుకున్న సమయం రికార్డు స్థాయిలో 6 ఏళ్ల 4 నెలలు మాత్రమే!ఈ గణాంకాలు భారతదేశంలో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, మెరుగైన కొనుగోలు శక్తి , మారుతీ సుజుకి పట్ల ప్రజల్లో ఉన్న అపారమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
మారుతీ సుజుకి మొత్తం అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన మోడళ్లు స్థిరంగా తమ సత్తా చాటాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఎంట్రీ-లెవల్ హీరో’గా నిలిచిన ఆల్టో, ఇప్పటివరకు 47 లక్షలకు పైగా యూనిట్లతో తిరుగులేని విజయాన్ని సాధించింది.’ఫ్యామిలీ కారు’గా పేరొందిన వ్యాగన్ ఆర్ దాదాపు 34 లక్షల యూనిట్లకు చేరుకుంది. యువత మరియు కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రియుల మనసు గెలుచుకున్న స్విఫ్ట్, 32 లక్షలకు పైగా యూనిట్లతో ఈ జాబితాలో నిలిచింది.
ఇటీవలి కాలంలో విడుదలైన కాంపాక్ట్ ఎస్‌యూవీలు బ్రెజ్జా , ఫ్రాంక్స్ కూడా అత్యధికంగా అమ్ముడైన టాప్ పది వాహనాలలో స్థానం దక్కించుకోవడం, మారుతీ యొక్క పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి నిదర్శనం.
ఈ ఘనత సాధించినప్పటికీ, మారుతీ సుజుకి ఇండియా ఎండీ , సీఈఓ హిశాషి టెకుచి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి 1,000 మందిలో కేవలం 33 మంది వద్ద మాత్రమే కార్లు ఉన్నాయి. అంటే మేము సాధించాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందికి కార్లను అందించాలనే తమ లక్ష్యాన్ని కంపెనీ కొనసాగిస్తుందని, తద్వారా భారతీయుల ప్రయాణ ఆనందాన్ని పంచుకుంటుందని ఆయన తెలిపారు.


