Maruti Suzuki Top in sales: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ మరో ఘనత సాధించింది. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్-10 ఆటోమేకర్స్ జాబితాలో స్థానం సంపాదించింది. దాదాపు 57.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఫోర్డ్, జనరల్ మోటార్స్ (జీఎం), ఫోక్స్‌వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను దాటేసింది. కాగా, ప్రస్తుతం ప్రపంచ ఆటోమేకర్స్ ర్యాంకింగ్స్‌లో టెస్లా అగ్రస్థానంలో ఉంది. దాని మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ డాలర్లు. రెండో స్థానంలో టయోటా (314 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో బీవైడీ (133 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో ఫెరారీ (92.7 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో బీఎండబ్ల్యూ (61.3 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో మెర్సిడెస్-బెంజ్ (59.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. తాజాగా, 57.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మారుతీ సుజుకీ.. ఫోర్డ్ (46.3 బిలియన్ డాలర్లు), జీఎమ్ (57.1 బిలియన్ డాలర్లు), ఫోక్స్‌వ్యాగన్‌లను (55.7 బిలియన్ డాలర్లు) వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.
ఫెస్టివల్ సేల్‌లో అగ్రగామిగా మారుతీ..
ఓవైపు జీఎస్టీ రేట్ల తగ్గింపు, మరోవైపు పండుగ ఆఫర్లతో మారుతీ సుజుకీ వివిధ మోడళ్లపై కార్ల ధరలను తగ్గించింది. దీంతో, పండుగ సీజన్లో మారుతి సుజుకి అమ్మకాలతో ముందంజలో ఉంది. పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 80,000 పైగా మారుతి కార్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు, ప్రతిరోజూ దాదాపు 80,000 మంది మారుతీ షోరూంలను విజిట్ చేస్తున్నారని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా మారుతీ షోరూమ్‌లు చాలా రద్దీగా ఉండటంతో డీలర్లు రాత్రి 12 గంటల వరకు కార్లను డెలివరీ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన మొదటి రోజే.. మారుతి సుజుకి 25,000 కార్లను డెలివరీ చేసి 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా కార్ల కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు, కొనుగోళ్లు పెంచేందుకు కంపెనీ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. తమ కార్లపై భారాన్ని తగ్గించేందుకు మారుతి సుజుకి ఓ ఈఎంఐ పథకాన్ని ప్రారంభించింది. ఈఎంఐ కేవలం రూ. 1,999 నుంచి ప్రారంభం కానుంది. అంటే బైక్ లేదా స్కూటర్ ఈఎంఐతో సమానంగా అందించేందుకు యత్నిస్తోంది. మనదేశంలో లక్షలాది మంది ద్విచక్ర వాహన వినియోగదారులు ఉండటంతో వారికి కొంచెం ప్రోత్సాహం అందించి కార్లవైపు మొగ్గు చూపేలా కంపెనీ ఈ స్ట్రాటజీ అమలు చేస్తుంది. దీని కింద వినియోగదారులు నెలకు కేవలం రూ. 1,999 చెల్లించి కారు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. ఇది ఈఎంఐలను మరింత సులభతరం చేయడంలో సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, మారుతి కొన్ని ఎంట్రీ-లెవల్ మోడళ్ల ధరలను 24% వరకు తగ్గించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31, 2025 వరకు అమలులో ఉంటుంది.


