Meesho Initial Public Offering : మరో స్టార్టప్ కంపెనీ ఐపిఒకు రంగం సిద్ధం చేసుకుంటోంది. భారతీయ ఈ-కామర్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ మీషో (Meesho) త్వరలో పబ్లిక్ లిస్టింగ్ ద్వారా రూ. 4,250 కోట్ల నిధులు సమీకరించబోతోంది. సంస్థ బోర్డు ఇటీవల ఐపీఓ (Initial Public Offering) ను ఆమోదించింది. ఈ పబ్లిక్ ఇష్యూలో తాజా ఈక్విటీతో పాటు, ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకునే ఆఫర్ ఫర్ సేల్ (OFS) భాగాన్ని కూడా చేర్చనున్నారు. ఇది కంపెనీ అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. 2015లో విదిత్ ఆత్రేయ మరియు సంజీవ్ బర్న్వాల్ అనే ఇద్దరు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులు మీషోను స్థాపించారు. “సోషల్ కామర్స్” కాన్సెప్ట్ ఆధారంగా ప్రారంభమైన ఈ సంస్థ, ఇప్పుడు గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (GMV) పరంగా దేశంలో మూడవ అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా నిలిచింది. వాస్తవానికి, ఈ సంస్థ విజన్ చిన్న వ్యాపారవేత్తలు, ముఖ్యంగా మహిళలకు డిజిటల్ ఆధారిత వ్యాపార అవకాశాలు కల్పించడమే.
మీషోకు ఇప్పటికే Meta (Facebook), Prosus, Peak XV Partners, DST Global, Tiger Global వంటి ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంతో, ఐపీఓకి ముందుగా కొన్ని వ్యూహాత్మక మార్పులు కూడా చేపట్టారు.
చైర్మన్‌గా విదిత్ ఆత్రేయ, కంపెనీ పేరు మార్పు
కంపెనీ సీఈఓగా ఉన్న విదిత్ ఆత్రేయను ఇప్పుడు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా నియమించారు. గత వారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) అనుమతితో అమెరికా నుంచి భారత్ కు మారింది. దీంతో పాటు సంస్థ పేరు కూడా ‘మీషో ప్రైవేట్ లిమిటెడ్’ నుంచి ‘మీషో లిమిటెడ్’ గా మార్చబడింది. త్వరలో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సెబీకి సమర్పించే అవకాశం ఉంది.మీషో ఆర్థిక స్థితి కూడా ఐపీఓకు అనుకూలంగా మారుతోంది. FY23లో రూ. 1,675 కోట్ల నష్టం ఎదురైన సంస్థ, FY25 నాటికి ఈ నష్టాన్ని 82% తగ్గించి రూ. 304.9 కోట్లకు పరిమితం చేసింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 5,734.5 కోట్ల నుంచి రూ. 7,614.9 కోట్లకు, అంటే 33 శాతం పెరిగింది. ఈ మెరుగుదల పెట్టుబడిదారులకు కంపెనీపై మరింత నమ్మకం కలిగిస్తోంది.
మీషో ఐపీఓ ప్రణాళికలు, భారత టెక్ రంగంలో వేగంగా పెరుగుతున్న పబ్లిక్ లిస్టింగ్ ధోరణిలో భాగమని చెప్పవచ్చు. ఇప్పటికే అర్బన్ కంపెనీ, షిప్‌రాకెట్, వేక్‌ఫిట్, పైన్ ల్యాబ్స్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ వంటి టెక్ స్టార్టప్‌లు DRHPలు దాఖలు చేశాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా సింగపూర్ నుంచి ఇండియాకు డొమిసైల్ మార్చే ప్రక్రియలో ఉంది.
టియర్-2, టియర్-3 నగరాలకు విస్తరించిన వ్యాపారం
మీషో బిజినెస్ మోడల్ మాదిరిగా, ప్రజల వద్ద ఇన్వెంటరీ లేకుండానే, తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పించడం అనేది అరుదైనది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఈ మోడల్ ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధులవుతున్నారు. ఇదే విషయం గ్లోబల్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.
మార్కెట్‌కు కొత్త ఉత్సాహం
ఈ ఐపీఓ విజయవంతమైతే, భారతీయ స్టాక్ మార్కెట్‌లో టెక్, ఈ-కామర్స్ రంగాలకు మరింత ఉత్సాహం లభించనుంది. ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి మీషో లిస్టింగ్ పైనే ఉంది. సంస్థ గత మూడేళ్లలో చేసిన పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక మెరుగుదల మరియు మార్కెట్‌లోని స్థిరమైన స్థానం దానిని విజయవంతమైన ఐపీఓ దిశగా నడిపిస్తున్నాయి.