Tata Trusts : భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యాపార సామ్రాజ్యంగా పేరుగాంచిన టాటా గ్రూప్‌లోని ప్రధాన ట్రస్ట్‌ల నుండి మెహ్లీ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ యొక్క నైతిక విలువలు, సుపరిపాలన , సమగ్రతను కాపాడేందుకు తాను సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ మరియు బాయి హీరాబాయి JN టాటా నవ్‌సరి ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్ ట్రస్ట్‌ల ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు.
దివంగత రతన్ ఎన్. టాటాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు, గురువుగా మిస్త్రీ తన లేఖలో పేర్కొన్నారు. రతన్ టాటా వ్యక్తిగత ఆమోదం మేరకే ట్రస్టీగా అవకాశం లభించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
వివాదమే రాజీనామాకు కారణం
గత ఏడాది మిస్త్రీని జీవితకాల ట్రస్టీగా తిరిగి నియమించాలని ట్రస్టీల బోర్డు తీర్మానించినప్పటికీ, ప్రధాన ట్రస్ట్‌ల ఆమోదం లభించకపోవడంతో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. తన పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ట్రస్టీషిప్ గురించి జరుగుతున్న ఊహాగానాలు, నివేదికలు టాటా ట్రస్ట్‌ల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని మిస్త్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రస్ట్‌ల ప్రతిష్టను ప్రభావితం చేసే వివాదాలను నివారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, రతన్ టాటా నిలబెట్టిన ప్రజా ప్రయోజనాల స్ఫూర్తిని గౌరవించేందుకే తాను వైదొలగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సంస్థ కంటే ఎవరూ గొప్పవారు కాదనే రతన్ టాటా మాటలను ఉటంకిస్తూ, ట్రస్ట్‌ల గౌరవాన్ని నిలపడంలో తన నిబద్ధతను చాటుకున్నారు.
ట్రస్టీల నియామక ప్రక్రియలో మార్పుల కోసం ఛారిటీ కమిషనర్‌కు ముందస్తు హెచ్చరిక దాఖలు చేసిన కొద్ది రోజులకే మిస్త్రీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ రాజీనామాతో, టాటా ట్రస్ట్‌ల పాలన , అంతర్గత విధానాలపై జరుగుతున్న చర్చలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది.


