Saturday, November 15, 2025
Homeబిజినెస్Michael Burry : ఏఐ బుడగ పేలుతుందా? 'బిగ్ షార్ట్' మరో భారీ పందెం.. రూ.9,700...

Michael Burry : ఏఐ బుడగ పేలుతుందా? ‘బిగ్ షార్ట్’ మరో భారీ పందెం.. రూ.9,700 కోట్లతో మార్కెట్‌పై గురి!

AI stock market bubble : 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టి, పతనమవుతున్న మార్కెట్‌పై పందెం కాసి వేల కోట్లు ఆర్జించిన మేధావి ఆయన. ‘ది బిగ్ షార్ట్’గా ప్రపంచానికి పరిచయమైన ఆయనే ప్రఖ్యాత ఇన్వెస్టర్ మైఖేల్ బర్రీ. ఇప్పుడు, ఆయన మరోసారి తన పదునైన అంచనాతో ప్రపంచ మార్కెట్లను హెచ్చరిస్తున్నారు. ఈసారి ఆయన గురి టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టాక్స్‌పై! ఏకంగా రూ.9,700 కోట్లతో మార్కెట్ పతనమవుతుందని పందెం కాశారు. అసలు బర్రీ అంచనా ఏంటి? ఏఐ స్టాక్స్‌లో నిజంగానే ఓ బుడగ దాగి ఉందా?

- Advertisement -

ఎవరీ ‘ది బిగ్ షార్ట్’ : 2008లో అమెరికా హౌసింగ్ మార్కెట్ కృత్రిమంగా పెరిగిపోయిందని, త్వరలోనే కుప్పకూలుతుందని అందరికన్నా ముందే ఊహించారు మైఖేల్ బర్రీ. ప్రపంచమంతా లాభాల బాటలో పయనిస్తుంటే, ఆయన మాత్రం మార్కెట్‌కు వ్యతిరేకంగా పందెం కాశారు. ఆ ఒక్క సాహసోపేత నిర్ణయంతోనే ఆయన సంస్థ రూ.7,300 కోట్లు ($825 మిలియన్లు) ఆర్జించింది. ఆయన కథే స్ఫూర్తిగా ‘ది బిగ్ షార్ట్’ అనే సినిమా కూడా వచ్చింది.

ఈసారి పందెం ఏఐపైనే   ఇప్పుడు, బర్రీకి చెందిన ‘సైయాన్ అసెట్ మేనేజ్‌మెంట్’ (Scion Asset Management) అనే సంస్థ, మార్కెట్‌పై మరో భారీ పందెం వేసింది. ఈసారి ఆయన అంచనా ప్రకారం, ఏఐ రంగంలోని కంపెనీల షేర్ల విలువ కృత్రిమంగా పెరిగిపోయిందని, త్వరలోనే ఆ బుడగ పేలిపోయి మార్కెట్ క్రాష్‌కు దారితీస్తుందని భావిస్తున్నారు. అందుకే, ఏకంగా రూ.9,700 కోట్లు ($1 బిలియన్) విలువైన ‘షార్ట్’ పొజిషన్లు తీసుకున్నారు. అంటే, ఆ కంపెనీల షేర్లు పడిపోతాయని ఆయన పందెం కాస్తున్నారు.

టార్గెట్‌లో రెండు ఏఐ దిగ్గజాలు : మైఖేల్ బర్రీ ప్రధానంగా రెండు ఏఐ దిగ్గజాలపై గురిపెట్టారు:
ఎన్విడియా (Nvidia): ఏఐ చిప్‌ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థపై $186.58 మిలియన్ల మేర పందెం కాశారు.
పలాంటిర్ (Palantir): డేటా అనలిటిక్స్‌లో కీలకమైన ఈ సంస్థపై ఏకంగా $912.10 మిలియన్ల పందెం వేశారు. 2008 సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసిన బర్రీ, ఇప్పుడు ఏఐ రంగంపై ఇంతటి ప్రతికూల అంచనా వేయడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును శాసిస్తుందని అందరూ భావిస్తుంటే, బర్రీ అంచనా నిజమవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad