Moringa Farming Success Story: “వ్యవసాయం దండగ” అనే మాటలకు చెక్ పెట్టారు ఓ విశ్రాంత ప్రొఫెసర్. చదువుకున్న చదువుకు, పొలంలో చిందించిన స్వేదాన్ని జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం 9 ఎకరాల్లో 30 వేల మునగ మొక్కలతో సరికొత్త సాగు విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆకును అద్భుత ఔషధంగా మార్చి, విలువ ఆధారిత ఉత్పత్తులతో లక్షలు గడిస్తున్నారు. అసలు, ఇంజినీరింగ్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆయన ఈ సాగు వైపు ఎందుకు వచ్చారు..? మునగాకులో ఉన్న అద్భుతాలేంటి…? ఈ సాగులో ఆయన విజయ రహస్యమేంటి..?
వినూత్నంగా ఆలోచిస్తే వ్యవసాయం కల్పతరువే అని నిరూపిస్తున్నారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, సావంగీ మక్రమ్‌పూర్ గ్రామానికి చెందిన డాక్టర్ విశ్రామ్ బాపట్. ఒకప్పుడు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆయన, ఇప్పుడు తన పొలంలో మునగ సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/business/sebi-warning-to-investors-that-be-vigilant-about-can-trading/
ఆలోచన నుంచి ఆచరణ వరకు : రిటైర్మెంట్ తర్వాత తన స్వగ్రామానికి వచ్చిన డాక్టర్ విశ్రామ్ బాపట్, కొవిడ్ సమయంలో సేంద్రియ కూరగాయల సాగు చేపట్టారు. అప్పుడే ప్రత్యామ్నాయ పంటల వైపు ఆయన దృష్టి మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా “సూపర్ ఫుడ్”గా మునగాకుకు ఉన్న డిమాండ్‌ను గుర్తించారు. 2022లో ప్రయోగాత్మకంగా అర ఎకరం పొలంలో మునగ సాగు చేసి, దాని ఫలితాలతో ఉత్తేజితులయ్యారు.
2023 ఫిబ్రవరిలో తనకున్న 9 ఎకరాల పొలంలో ఏకంగా 25,000 నుంచి 30,000 మునగ మొక్కలను నాటారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న రైతు హరిశ్చంద్ర ముందే సహాయంతో, పూర్తిగా సహజసిద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి రసాయనాలు వాడకుండా సాగు చేపట్టారు. కేవలం ఆరు నెలల్లోనే మొక్కలు ఏపుగా పెరిగి, ఆకుల కోతకు వచ్చాయి.
ఆకుపచ్చ బంగారం.. ఆరోగ్య ప్రదాయని : “మునగాకు ఒక దివ్య ఔషధం. కడుపు, చర్మ సంబంధిత వ్యాధులతో సహా సుమారు 300 రకాల రుగ్మతలను నయం చేసే శక్తి దీనికుంది,” అని డాక్టర్ బాపట్ ఆత్మవిశ్వాసంతో చెబుతారు.
ప్రాసెసింగ్ విధానం: కోసిన ఆకులను సోలార్ టన్నెల్ డ్రైయర్‌లో ఒకటిన్నర రోజులు ఆరబెడతారు. దీనివల్ల ఆకుల పచ్చదనం, పోషక విలువలు నశించవు. ఆ తర్వాత వాటిని గ్రైండింగ్ చేసి పొడిని తయారు చేస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు: ఈ పొడిని రోజూ ఉదయం నీటిలో కలిపి తాగితే కడుపు శుభ్రపడటంతో పాటు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని, రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుందని ఆయన తన అనుభవంతో వివరిస్తున్నారు. “68 ఏళ్ల వయసులో కూడా నేను ఇంత చురుకుగా పనిచేయడానికి ఈ మునగాకు పొడే కారణం,” అంటారు బాపట్.
విలువ జోడింపు.. వ్యాపార దక్షత :“రైతుకు సాగుతో పాటు వ్యాపారం కూడా తెలిసి ఉండాలి” అనే సూత్రాన్ని నమ్మిన బాపట్, మునగాకును నేరుగా అమ్మకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. కృష్ణశృతి పేరుతో ఆరోగ్యకరమైన మరియు సౌందర్య ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. మునగాకు పొడి, బిస్కెట్లు, టీ పౌడర్, ఫేస్ ప్యాక్‌ల వంటివి ఆన్‌లైన్ ద్వారా మరియు దుకాణాలలో లభ్యమవుతున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/business/sebi-warning-to-investors-that-be-vigilant-about-can-trading/
లాభాల లెక్కలు : మునగ సాగు, రైతులకు ఒక దీవెనగా నిలుస్తోంది. ఎందుకంటే, ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన మునగ నుంచి కనీసం ఒక టన్ను నాణ్యమైన ఆకులను సేకరించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పచ్చి ఆకులకు టన్నుకు సుమారు రూ. 70,000 ధర పలుకుతోంది. అయితే, మునగ ఆకులను ఎండబెట్టి పొడిగా మార్చడం ద్వారా వాటి విలువ మరింత పెరుగుతుంది. పొడి రూపంలో టన్నుకు రూ. 1,00,000 వరకు లాభం ఆర్జించవచ్చు. ముఖ్యంగా, మునగ చెట్లు ఒక్కసారి నాటితే, అవి సుదీర్ఘకాలం పాటు, అంటే సుమారు 12 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినివ్వడం దీనికి మరింత సానుకూల అంశం. అందుకే మునగను రైతుల పాలిట వరంగా అభివర్ణిస్తున్నారు
నిపుణులు, వైద్యుల మాట : ఉద్యానవన నిపుణులు: “మునగ చెట్టులోని ప్రతి భాగం ఉపయోగకరమే. ఆకులు, కాయలు, పువ్వులు, విత్తనాలు అన్నీ ఆరోగ్యకరమైనవి. అందుకే దీనికి సూపర్ ఫుడ్ హోదా వచ్చింది. తక్కువ నీటితో, దాదాపు అన్ని నేలల్లో ఇది పెరుగుతుంది,” అని శ్రీ శివాజీ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కేశవ్ ఠాకూర్ తెలిపారు.
వైద్యులు: “పాలతో పోలిస్తే మునగాకులో ప్రోటీన్లు ఎక్కువ. ఐరన్, కాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాహార లోపాన్ని అధిగమించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది,” అని శిశువైద్య నిపుణులు డాక్టర్ జయంత్ పంధారికర్ పేర్కొన్నారు.


