Wednesday, July 16, 2025
Homeబిజినెస్IndiaRealEstate : ముంబైలో ఇల్లు ఇంత కష్టమా..

IndiaRealEstate : ముంబైలో ఇల్లు ఇంత కష్టమా..

Most expensive city Mumbai : ముంబై నగరం దేశ వాణిజ్య రాజధాని, అంతేకాదు ఇక్కడ వ్యాపార, సినీ దిగ్గజాలు కొలువై ఉంటారు. ముంబై అనే పేరు వినగానే ఎన్నో కలలు, అవకాశాలు మనసుకు మెదులుతాయి. కానీ ఆ కలలు నెరవేర్చడమంటే మాటలు కాదు. ముఖ్యంగా అక్కడ ఒక ఇల్లు కొనాలంటే.. ఎంతో కష్టమైన విషయం.. ఇప్పుడు ముంబై అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా మారిపోయింది. ఒక తాజా నివేదిక ప్రకారం, మహారాష్ట్రలో అత్యంత ధనిక 5% పట్టణ కుటుంబాలకే ముంబైలో సగటు సైజు ఇల్లు కొనాలంటే 109 సంవత్సరాల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇదే నిజంగా ఆర్థిక అసమానతల ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు.

- Advertisement -

ఈ నివేదిక కోసం నేషనల్ హౌసింగ్ బోర్డు (NHB) గణాంకాలు, పట్టణ ఆదాయాల అంచనాలు ఆధారంగా విశ్లేషణ చేశారు. నివేదిక ప్రకారం, టాప్ 5% ఆదాయ వర్గానికి చెందిన కుటుంబాల వార్షిక ఆదాయం సుమారుగా రూ.10.7 లక్షలు ఉంటుంది. భారతదేశ సగటు పొదుపు రేటు 30.2%గా పరిగణిస్తే, వారు ఒక సంవత్సరంలో దాదాపు రూ.3.2 లక్షలు మాత్రమే పొదుపు చేయగలుగుతారు. మరోవైపు, ముంబైలో 1,184 చదరపు అడుగుల ఫ్లాట్ కొనడానికి సుమారుగా రూ.3.5 కోట్లు అవసరం అవుతుంది. అంటే, వారి పొదుపుతో ఆ ఇంటి ధరను చేరాలంటే సుమారు 109 సంవత్సరాల సమయం పడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితకాలం కంటే ఎక్కువ.. అంటే, కుటుంబం తరం తరాలుగా కూడ పొదుపు చేస్తే తప్ప ఆ కల నెరవేరదు.

ఇది కేవలం ముంబైకే పరిమితం కాదు. భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇల్లు కొనడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఉదాహరణకి, గురుగ్రామ్‌లో ఒక సగటు ఇల్లు కొనాలంటే అత్యంత సంపన్నులు కూడా 64 సంవత్సరాలు ఆదా చేయాలి. బెంగళూరులో 36 సంవత్సరాలు, ఢిల్లీలో 35 సంవత్సరాలు పట్టవచ్చు. అయితే చండీగఢ్ మాత్రం ఒక సానుకూల ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడ కేవలం 15 సంవత్సరాల పొదుపుతో ఒక ఇంటిని కొనుగోలు చేయవచ్చు.

ఈ గణాంకాలు సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చకు దారి తీసాయి. కొంతమంది నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రామాణికతపై సందేహాలు వ్యక్తం చేయగా, మరికొందరు దీన్ని ముంబై నగరానికి చెందిన “సిగ్గుతో కూడిన నిజం”గా పేర్కొన్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు ప్రజలు చిన్న పట్టణాలవైపు మొగ్గు చూపాలనుకుంటున్నారు.

ఇంకొంత మంది నిపుణులు సూచించేది, ముంబై వంటి నగరాల్లో గృహధరాల పెరుగుదలకు ఒక ముఖ్య కారణం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అని అంటున్నారు. వీరు విలాసవంతమైన ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. NoBroker.com నివేదిక ప్రకారం, ఈ ఎన్ఆర్ఐలు 2025 నాటికి దేశవ్యాప్తంగా జరిగే గృహ విక్రయాలలో దాదాపు 20% వాటా కలిగి ఉండొచ్చు. దీనివల్ల డిమాండ్ పెరగడం, ధరకే అదుపు లేకపోవడం జరుగుతోంది.

2023లో ANAROCK నివేదిక ప్రకారం, దేశంలోని టాప్ 7 నగరాల్లో గృహధరలు సాధారణంగా 23% పెరిగాయి. ఇందులో ఎన్సిఆర్ 56%తో ముందుంది, దాని తర్వాత బెంగళూరు (44%), హైదరాబాద్ (37%) ఉన్నాయి. ఇది ఆదాయం పెరుగుదల కన్నా ఆస్తుల ధరలు వేగంగా పెరుగుతున్నాయని స్పష్టంగా చూపుతోంది.

ఈ వాస్తవాలన్నీ చూస్తే, ముంబైలో ఇల్లు కొనడం ఇప్పుడు ధనవంతులకే కాదు, అతి ధనవంతులకే సాధ్యమైయ్యే విషయంలగా మారిపోయింది. మధ్యతరగతి కుటుంబాలకు అయితే అది కలగా మారింది. చిన్న పట్టణాల వైపు మొగ్గు చూపడం, లేదా ప్రాథమికంగా అద్దెకు బదులుగా జీవన నాణ్యతను మెరుగుపరచే దిశగా ఆలోచించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఇల్లు అంటే జీవితం మొత్తానికి గుర్తుగా భావిస్తారు. కానీ భారతీయుల మనస్తత్వంలో ఇప్పుడు గణనీయమైన మార్పు అవసరం ఉందని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News