Donation :భారతదేశంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆధ్యాత్మిక చింతనతో కూడిన మరో గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల ఆయన ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా, ఈ రెండు ప్రముఖ దేవాలయాలకు ఆయన ఏకంగా రూ. 10 కోట్లు భారీ విరాళంగా అందించారు. బద్రీనాథ్ చేరుకున్న అంబానీకి బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ఘన స్వాగతం పలికి, ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని బహుకరించారు.
ధామి ప్రభుత్వంపై అంబానీ ప్రశంసల జల్లు
ఆలయాల సందర్శన అనంతరం ముఖేష్ అంబానీ.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కల్పిస్తున్న యాత్రికుల సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా తాను ఉత్తరాఖండ్‌ను సందర్శిస్తున్నానని, అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్రకు కల్పించిన ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.
యాత్రికుల కోసం తీర్థయాత్ర మార్గంలో కల్పించిన సురక్షితమైన, చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు ఇతర మతపరమైన ప్రాంతాలలో చాలా అరుదుగా కనిపిస్తాయని ఆయన అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న చారిత్రక పని ఇదని ప్రశంసిస్తూ, రాబోయే పదేళ్లలో రాష్ట్రానికి వచ్చే యాత్రికుల సంఖ్య వేగంగా పెరుగుతుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు ముఖేష్ అంబానీ తన సంతాపాన్ని తెలియజేశారు. “ప్రతి కష్టకాలంలోనూ తాను, రిలయన్స్ ఫౌండేషన్ ఉత్తరాఖండ్‌కు తోడుగా ఉంటామని” ఆయన హామీ ఇచ్చారు.
అలాగే, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, దేవాలయాలు మరియు పర్యావరణ పరిరక్షణకు తన పూర్తి మద్దతును అందిస్తామని అంబానీ స్పష్టం చేశారు. అంబానీ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఈ పవిత్ర క్షేత్రాలకు తమ తోడ్పాటును అందిస్తోంది. విష్ణువు 108 దివ్య దేశాలలో ఒకటిగా, ఆది శంకరాచార్యులచే పునఃస్థాపించబడిన బద్రీనాథ్ ఆలయానికి ముఖేష్ అంబానీ అందించిన ఈ భారీ విరాళం, భక్తులలో మరింత సంతోషాన్ని నింపుతోంది.


