Forbes Worlds Billionaires List: ప్రపంచ ధనవంతుల జాబితా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 జాబితాలో ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా (నం.1) నిలిచారు. ప్రపంచ స్థాయిలో ఆయన 18వ స్థానానికి పడిపోగా, ఆసియా ఖండంలో మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం సుమారు $92.5 బిలియన్ డాలర్లుగా (రూ. 7.68 లక్షల కోట్లు) ఉంది. గత ఏడాది $116 బిలియన్‌తో (రూ. 9.63 లక్షల కోట్లు) ఉన్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వచ్చిన స్వల్ప తగ్గుదల వల్ల ఆయన స్థానం కొద్దిగా దిగింది. అయినా, టెలికాం, రిటైల్, డిజిటల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఆయన చేస్తున్న పెట్టుబడులు భారతదేశం గర్వించదగినవి. ముకేశ్ రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టులతో జియో 5G, రిలయన్స్ రిటైల్ విస్తరణ, డేటా సెంటర్లు, హైడ్రోజన్ ప్లాంట్లు వంటివి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పెద్ద ప్రాజెక్టులు ఆయనకు భవిష్యత్‌లో మరింత సందను అందించే అవకాశముంది.
ప్రపంచ బిలియనీర్లలో మూడో స్థానం
2025లో భారతదేశానికి చెందిన మొత్తం 205 బిలియనీర్లు ఫోర్బ్స్ జాబితాలో ఉన్నారు. ఇది ప్రపంచంలో మూడో అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. అగ్రదేశాలు అమెరికా, చైనా తర్వాత భారత్ ఈ స్థానాన్ని పొందడం గొప్ప విషయం. ఈ 205 మందిలో టాప్ 10 భారతీయ బిలియనీర్ల వివరాలు చూస్తే, దేశ వ్యాపార పరిధి ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది.
అదానీ రెండో స్థానం
భారతదేశంలో ముఖేష్ అంబానీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో అదానీ 28వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ $56.3 బిలియన్ (రూ.4.67 లక్షల కోట్లు) ఉంది. ఆయన వ్యాపారాల్లో ఎక్కువగా స్టీల్, పోర్ట్స్, ఎనర్జీ వంటి రంగాలు ఉన్నాయి.
మూడో స్థానంలో సావిత్రీ జిందాల్ ఫ్యామిలీ
ఇక మూడో స్థానంలో సావిత్రీ జిందాల్ కుటుంబం నిలిచింది. వారి ఆస్తి విలువ సుమారు $35.5 బిలియన్ ఉంది. జిందాల్ గ్రూప్ ఇండియన్ స్టీల్ పరిశ్రమలో ప్రముఖంగా నిలిచింది. నాలుగవ స్థానంలో ఉన్న శివ్ నాడార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడిగా $34.5 బిలియన్ ఆస్తితో ఉన్నారు. ఐటీ రంగంలో ఆయన సేవలు గొప్పవిగా గుర్తించబడ్డాయి. అయిదవ స్థానంలో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి $25 బిలియన్‌తో నిలిచారు. ఆరోగ్యరంగాన్ని మారుస్తున్న ఆయన ఫార్మా వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది.
6వ స్థానంలో..
ఆరో స్థానంలో సైరస్ పూనావాలా $23.1 బిలియన్‌తో ఉన్నారు. ఏడవ స్థానంలో కుమార్ మంగళం బిర్లా $21.8 బిలియన్‌తో నిలిచారు. అడిత్య బిర్లా గ్రూప్ ఆయన నేతృత్వంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఎనిమిదవ స్థానంలో లక్ష్మీ మిత్తల్ ఉన్నారు. ప్రపంచ ఐరన్ అండ్ స్టీల్ దిగ్గజంగా అర్సెలార్ మిత్తల్ కంపెనీ కొనసాగుతోంది. భారత్‌లోని బిలియనీర్లు వివిధ రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖేష్ అంబానీ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, ఇతరులు కూడా తమదైన విధంగా దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్నారు. టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం, ఎడ్యుకేషన్, పవర్, ఫైనాన్స్, ఫార్మా వంటి రంగాల్లో భారతీయ బిలియనీర్లు తమ ముద్ర వేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.
టాప్ 10 భారతీయుల వివరాలు:
- ముఖేష్ అంబానీ – 92.5 బిలియన్ డాలర్లు
- గౌతమ్ అదానీ – 56.3 బిలియన్ డాలర్లు
- సావిత్రి జిందాల్ & కుటుంబం – 35.5 బిలియన్ డాలర్లు.
- శివ్ నాదార్ – 34.5 బిలియన్ డాలర్లు
- దిలీప్ సంఘ్వి – 24.9 బిలియన్ డాలర్లు
- సైరస్ పూనావాలా – 23.1 బిలియన్ డాలర్లు
- కుమార్ బిర్లా – 20.9 బిలియన్ డాలర్లు
- లక్ష్మీ మిత్తల్ – 19.2 బిలియన్ డాలర్లు
- రాధాకిషన్ డమాని – 15.4 బిలియన్ డాలర్లు
- కుషాల్ పాల్ సింగ్ – 14.5 బిలియన్ డాలర్లు