Reliance Intelligence AI : కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతిక ప్రపంచాన్ని మార్చిపెడుతోంది. భారతదేశంలో దీన్ని ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొత్త చర్యలు ప్రవేశపెట్టారు. రిలయన్స్‌కు అనుబంధంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ (Reliance Intelligence) పేరుతో కొత్త సంస్థను ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా ఏఐ సాంకేతికతను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గూగుల్, మెటా వంటి ప్రపంచ ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ లక్ష్యాన్ని సాధించాలని అంబానీ వెల్లడించారు.
రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో మాట్లాడిన ముకేశ్ అంబానీ, దశాబ్దం క్రితం డిజిటల్ సేవలు రిలయన్స్‌కు కొత్త ఎదుగుదలను తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఏఐ కూడా అలాంటి గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని చెప్పారు. ‘మేము హామీ ఇచ్చినట్టు డిజిటల్ సేవలను ప్రతి చోట అందించాం. అలాగే ఏఐను కూడా అందరికీ చేరువ చేస్తామని రిలయన్స్ ఇంటెలిజెన్స్ హామీ ఇస్తోంది’ అని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఆధారిత ఏఐ డేటా సెంటర్లను నిర్మించి, దేశవ్యాప్తంగా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ పనులు ప్రారంభమైందని కూడా చెప్పారు.
ఈ AGMలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పాల్గొని మాట్లాడారు. ‘ప్రస్తుతం మనం అద్భుతమైన దశలో ఉన్నాం. మన ఏఐ వ్యవస్థలు తాము తాము మెరుగుపరచుకుంటున్నాయి. సూపర్ ఇంటెలిజెన్స్‌ను నిర్మించే అవకాశాలు తలెత్తుతున్నాయి. రిలయన్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషకరం. ఇది అందరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడానికి గొప్ప ముందడుగు’ అని జుకర్‌బర్గ్ అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కూడా తెలిపారు.
రిలయన్స్, మెటా జాయింట్ వెంచర్‌లో తొలుత రూ. 855 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, భారత్‌లో ఏఐకు అపార అవకాశాలు ఉన్నాయని, ఎనర్జీ, రిటైల్, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో ఏఐని విస్తృతంగా వాడుకుంటామని చెప్పారు. గూగుల్, రిలయన్స్ భాగస్వామ్యంతో జామ్‌నగర్ క్లౌడ్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ చర్యలతో భారతదేశం ఏఐ రంగంలో ముందంజలో నిలబడనుంది. ముకేశ్ అంబానీ దూరదృష్టి దేశ సాంకేతిక ప్రగతికి కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు అంచనా.


