Saturday, November 15, 2025
Homeబిజినెస్GST on Movies: కొత్త జీఎస్టీ రేట్లు: సినిమా టికెట్లు చవకగా, ఐపీఎల్ టికెట్లు ఖరీదైనవిగా...

GST on Movies: కొత్త జీఎస్టీ రేట్లు: సినిమా టికెట్లు చవకగా, ఐపీఎల్ టికెట్లు ఖరీదైనవిగా మారాయా?

GST On Movie Tickets: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు సినిమా టికెట్ల ధరలు, అలాగే ఐపీఎల్, ఇతర క్రీడా ఈవెంట్‌ల టికెట్‌లపై పెను ప్రభావం చూపనున్నాయి. ఈ కొత్త విధానం సామాన్య ప్రేక్షకులకు ఊరటనిస్తుందా లేదా అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది.

- Advertisement -

సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు:
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై పన్ను రేటును తగ్గించారు. ఇప్పటివరకు 12 శాతం ఉన్న పన్నును 5 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం సింగిల్ స్క్రీన్‌ థియేటర్లకు వెళ్లే సామాన్య ప్రేక్షకులకు భారీ ఉపశమనం కలిగించనుంది. అయితే రూ.100 పైన ఉన్న టికెట్లపై పన్ను రేటులో ఎలాంటి మార్పు లేదు. వాటిపై పాత రేటు 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. ఈ నిర్ణయం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు తీసుకున్నది. రూ.300 లోపు ఉన్న టికెట్లను 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం రూ.100 లోపు టికెట్లకు మాత్రమే ఈ రాయితీని వర్తింపజేసింది. దీని వల్ల సినిమా టికెట్లు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు, చిన్న పట్టణాల్లో థియేటర్ యజమానులకు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిర్ణయం సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీ పెంపు:
సినిమా టికెట్లకు పన్ను తగ్గించిన ప్రభుత్వం, ఐపీఎల్ వంటి ప్రముఖ క్రీడా ఈవెంట్‌ల టికెట్లపై పన్నును భారీగా పెంచింది. ఇప్పటివరకు 28 శాతం ఉన్న జీఎస్టీ రేటును ఏకంగా 40 శాతానికి పెంచారు. ఇది క్రీడా అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ పన్ను పెంపుతో ఐపీఎల్ టికెట్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి.

ఉదాహరణకు.. గతంలో రూ.1,280 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ. 1,400కి చేరనుంది. అదే విధంగా రూ. 500 టికెట్ ధర ఇప్పుడు దాదాపు రూ.700 కానుంది. ఇక రూ.2,000 టికెట్ అయితే ఏకంగా రూ. 3,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వం క్రీడా ఈవెంట్‌లను ఒక ‘లగ్జరీ’ ఈవెంట్ గా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ 2036 ఒలింపిక్స్.. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ టికెట్లపై వచ్చే అదనపు ఆదాయం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఈ పన్ను పెంపు ఒక వైపు ఆదాయాన్ని పెంచినా.. మరోవైపు సామాన్య ప్రేక్షకులకు ఐపీఎల్ వంటి ఈవెంట్‌లు దూరం చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad