MG Majestor SUV: భారత ఆటో మొబైల్ మార్కెట్లో మరో ఎస్‌యూవీ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. అనేక విభాగాలలో వాహనాలను విక్రయిస్తోన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా త్వరలో ఎంజీ మెజెస్టర్‌ను కొత్త ఎస్‌యూవీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు నేరుగా టయోటా ఫార్చ్యునర్‌కి పోటీగా రంగంలోకి దిగనుంది. ఈ ఎస్‌యూవీని ఇప్పటికే ఆటో ఎక్స్‌పో 2025లో మొదటిసారి చూపించగా, ఇప్పుడు మళ్లీ దీని పై ఆసక్తిని పెంచేందుకు ఎంజీ కొత్త టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్ లో ఏం కనిపించింది?
ఇప్పటివరకు వచ్చిన టీజర్లలో ముందు భాగం, సైడ్ ప్రొఫైల్ మాత్రమే కనిపించాయి. కానీ, తాజాగా తయారీదారు సోషల్ మీడియాలో విడుదల చేసిన రెండవ టీజర్ చూస్తే, మజెస్టర్ వెనుక భాగాన్ని చూపించారు. ఈ ఎస్‌యూవీ బ్లాక్ కలర్ లో కనిపిస్తోంది. 30 సెకన్ల వీడియో టీజర్ ప్రకారం..ఈ కారు LED DRLలు, కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్‌లు, పెద్ద ఫ్రంట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రెయిల్‌లను చూపిస్తుంది.
లాంచ్ తేదీ, ధర( అంచనా)
కంపెనీ టీజర్‌లో ఎంజీ మెజెస్టర్ లాంచ్ తేదీని కూడా వెల్లడించింది. ఇది ఫిబ్రవరి 12, 2026న భారతదేశంలో లాంచ్ కానుందని పేర్కొంది. ఈ కారు ఖచ్చితమైన ధర సమాచారం లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఎంజీ మెజెస్టర్ ధర రూ.40 లక్షల నుండి రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా!
ఫీచర్లు ఎలా ఉండవచ్చు?
ఎంజీ మోటార్స్ మెజెస్టర్‌లో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు. ఇందులో LED హెడ్‌లైట్లు, LED DRLలు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. పెద్ద ఫ్రంట్ గ్రిల్, పక్క నుంచి చూస్తే 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, బయటకు ఉబ్బిన వీల్ ఆర్చ్‌లు కారుకు మంచి ఆకారాన్ని అందిస్తాయి. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు 12.3 అంగుళాల పెద్ద స్క్రీన్లు ఉండవచ్చు. టైప్-C USB ఛార్జింగ్ పోర్ట్, చుట్టూ ఉన్న దృశ్యాలను చూపించడానికి 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ లాంటి సౌకర్యాలు ఈ ఎస్‌యూవీలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక సెఫ్టి ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, హిల్ అసిస్ట్, BSD, LCA, RCTA, DOW, సెల్ఫ్-అడాప్టివ్ క్రూజింగ్, ADAS వంటివి ఉండవచ్చు.
ఇంజిన్
కంపెనీ ఎస్‌యూవీ ఇంజిన్ గురించి ఎలాంటి సమాచారాన్ని అందించనప్పటికీ, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో వస్తుందని భావిస్తున్నారు. పెట్రోల్ ఇంజిన్ 184 kW పవర్, 410 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, టర్బోడీజిల్ ఇంజిన్ 160 kW పవర్, 500 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్లు 4X4 సామర్థ్యాన్ని కూడా అందిస్తాయి. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 190 కి.మీ. వేగంతో దూసుకుపోతే, డీజిల్ ఇంజిన్ వేరియంట్ గరిష్టంగా 175 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. కంపెనీ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించవచ్చు.

