No Cost EMI Loans: అర్జెంటుగా ఎక్కువ మొత్తంలో తక్కువ వడ్డీకి డబ్బు కావాలంటే బ్యాంకుల వైపు చూస్తుంటాం. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తారు. అయితే, కొన్ని వడ్డీ లేని రుణాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ వడ్డీ లేని రుణాలు అందరికీ ఇవ్వరు. వీటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ రుణాలు నిర్దిష్ట ప్రయోజనాల కోసం లేదా కొంత మంది కోసం మాత్రమే బ్యాంకులు అందిస్తాయి. వడ్డీలేని రుణాల గురించి తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులపై రుణాలు
ప్రస్తుతం భారత్‌లో క్రెడిట్ కార్డులు వినియోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. ఈ కార్డులను వినియోగించేవారు తమ దగ్గర నగదు లేకుండానే కార్డు పరిమితి మేరకు అనేక సేవలతో పాటు వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికి అప్పటికప్పుడు నగదు చెల్లించనక్కర్లేదు. కాబట్టి, ఇది కూడా ఒక వడ్డీ లేని రుణమే. 50 రోజుల గ్రేస్ పీరియడ్ తరువాత కూడా చెల్లించకపోతే జరిమానాలు భారీగా ఉంటాయి. గడువు తేది లోపులో చెల్లిస్తే జీరో వడ్డినే అని చెప్పొచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ
రిటైల్ రంగంలో వడ్డీ లేని రుణాలు ప్రసిద్ధి చెందాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు.. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ లేదా ఇతర ఉపకరణాలపై నో-కాస్ట్ ఈఎంఐలను అందిస్తున్నాయి. అదనంగా వడ్డీ చెల్లించకుండా మొత్తం ఖర్చును సమానమైన ఈఎంఐలుగా విభజించడానికి ఈ పథకాలు మిమ్మల్ని అనుమతిస్తాయి. వాయిదాలు వడ్డీ లేకుండా ఉన్నప్పటికీ, కొన్ని ఆఫర్‌లలో ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. ముఖ్యంగా, పండుగ అమ్మకాల సమయంలో కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా రుణాలిస్తాయి.
రైతులకు రుణాలు
రైతులు కొన్ని ప్రభుత్వ పథకాల కింద వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. వీటిని వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాల ఉపయోగానికి ఇస్తారు. రైతులు, విత్తనాలు, ఎరువులు లేదా పరికరాలను కొనుగోలు చేయడానికి ఈ నిధులను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ లేకుండా రుణాలను అందిస్తున్నాయి. అయితే, ఇటువంటి రుణాలను గడువులోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే తగిన జరిమానా ఉంటుంది.
పనిచేసే కంపెనీ ద్వారా
కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి వడ్డీ లేని రుణాలను అందిస్తుంటాయి. ఈ రుణాలు ఉద్యోగుల గృహనిర్మాణం, విద్య లేదా అత్యవసర పరిస్థితులు వంటి వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ రుణంపై అసలు మొత్తాన్ని నేరుగా ఉద్యోగి జీతం నుంచి నిర్ణీత వ్యవధిలో సంస్థ ఉపసంహరించుకుంటుంది. ఇటువంటి రుణాలపై వడ్డీ లేకపోయినా, అవి ప్రయోజనాలకే వర్తిస్తాయి.
ఎన్‌జీఓల ద్వారా
కొన్ని మైక్రోఫైనాన్స్ సంస్థలు, ఎన్‌జీఓలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తాయి. ఇవి వెనుకబడిన సంఘాలు, చిన్న వ్యాపారులు లేదా మహిళలకు ఇస్తారు. కొన్ని ఎన్‌జీఓలు వీధి వ్యాపారాలు చేసేవారికి సున్నా లేదా కనీస వడ్డీ రేటుకు కూడా రుణాలు ఇస్తుంటాయి.
విద్యా రుణాలు
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మేలు చేయాలనే లక్ష్యంతో కొన్ని ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులు వడ్డీలేని రుణాలు ఆఫర్ చేస్తుంటాయి. ఈ రుణాన్ని గ్రాడ్యుయేషన్ తర్వాత సకాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.


