Remittances hit a new record: విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఇండియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వారు భారతదేశానికి పంపిన డబ్బు మొత్తం రికార్డు నెలకొల్పింది. గత సంవత్సరంలో ప్రవాస భారతీయులు అక్షరాల రూ.11.63 లక్షల కోట్లు (135.46 బిలియన్ డాలర్లు) పంపారు. ఇప్పటివరకు ఏ సంవత్సరంలోనూ నమోదు కాని రికార్డును ఈసారి సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత సేవ మాత్రమే కాదు, దేశ వాణిజ్య లోటును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఒకప్పుడు, 2016-17లో దేశానికి వచ్చిన రెమిటెన్స్ మొత్తం రూ.5.26 లక్షల కోట్లు మాత్రమే. కానీ నేడు ఈ మొత్తం రెండు రెట్లు పెరిగి ఈ స్థాయికి చేరుకుంది. ప్రతి ఏడాది సగటున 16 శాతం మేర పెరుగుతున్న ఈ ప్రవాహం, విదేశాల్లో స్థిరపడిన భారతీయుల ఆదాయ స్థాయిని మాత్రమే కాకుండా, వారి దేశానురాగాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల నుంచి వచ్చిన డబ్బు, మొత్తం రెమిటెన్స్‌లో సుమారు 45% వరకు ఉంది. అంటే దేశానికి వచ్చే ప్రతీ 100 రూపాయల రెమిటెన్స్‌లో దాదాపు 45 రూపాయలు ఈ మూడు దేశాల నుంచే వస్తున్నాయి.
ప్రపంచ స్థాయిలో ఈ పరిస్థితిని చూస్తే భారతదేశం అత్యధిక రెమిటెన్స్ పొందిన దేశంగా నిలిచింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, భారత్ రెమిటెన్స్ రెండో స్థానంలో ఉన్న మెక్సికోను అధిగమించాయి. తరువాతి స్థానంలో చైనా ఉంది. ఇది విదేశాలలో భారతీయులు సంపాదిస్తున్న స్థిరమైన ఆదాయం, వారి కుటుంబాలపై చూపే ప్రేమను సూచిస్తుంది.
విశ్లేషణ ప్రకారం, ఈ రెమిటెన్స్‌లు కేవలం వ్యక్తిగత అవసరాల నిమిత్తం వినియోగించబడటమే కాకుండా, దేశ వాణిజ్య లోటులో దాదాపు 47 శాతం వరకు భర్తీ చేయగలిగాయి. అంటే, మనం దిగుమతులు చేయడంలో కలిగిన నష్టాన్ని ఈ డబ్బుతో తీరుస్తున్నాం. ఇది భారతీయ ఆర్థిక విధానానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది.
కేవలం కుటుంబాలకు డబ్బు పంపడమే కాదు, ఇప్పుడు ఎన్నారైలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్తులు కొనడం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం కావడం వంటి మార్గాల్లో దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. 2025 నాటికి భారతదేశంలో ఉండే NRI పెట్టుబడులు మొత్తం FDI కన్నా ఎక్కువ ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్న భారతీయుల ఆర్థిక ప్రగతి, వారి సామర్థ్యం, వారి దేశంతో ఉన్న అనుబంధం ఈ గణాంకాల రూపంలో బయటపడుతుంది. ఈ సహకారం అంతర్గత పెట్టుబడుల దిశగా మారుతున్నప్పుడు, భారతదేశ ఆర్థిక స్వావలంబన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తానికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశానికి వాస్తవంగా ఆశాకిరణంగా మారుతున్నారు.