ChatGPT Go Free for 1 year: మీరు చాట్‌జీపీటీని ఉపయోగిస్తుంటే, మీకో గుడ్ న్యూస్! ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ఏఐ ఇటీవల చాట్‌జీపీటీ గో పేరుతో భారత్ లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ సేవలకు సంబంధించి ఇండియాలో తన వినియోగదారులకు తాజాగా ఆఫర్ ప్రకటించింది. నెలకు రూ.399 ఖరీదు చేసే కొత్త చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు దేశీయ యూజర్లకు ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది నవంబర్ 4 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. ఇక్కడ ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. US తర్వాత భారత్ తమకు రెండో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ మార్కెట్ అని ఇటీవల కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.
చాట్‌జీపీటీ గో ఫ్రీ వెర్షన్, ఖరీదైన చాట్‌జీపీటీ ప్లస్ (రూ. 1999) సబ్‌స్క్రిప్షన్ మధ్యలో ఉంది. ఇది మధ్య శ్రేణి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. ఇండియాలో ఈ సంవత్సరం ఆగస్టులో నెలకు రూ. 399 ప్లాన్‌తో చాట్‌జీపీటీ గో లాంఛ్ చేసింది. అయితే, ఇప్పుడు మాత్రం ఉచితంగానే అందించనున్నట్లు తెలిపింది. దీని ప్రయోజనాల విషయానికి వస్తే ఫ్రీ ప్లాన్ తో పోలిస్తే, సందేశాల పరిమితి, ఇమేజ్ జనరేషన్, ఫైల్ లేదా ఇమేజ్ అప్లోడ్స్ 10 రెట్లు ఎక్కువగా ఉండనున్నాయి. మొమొరీ కూడా ఉచిత ప్లాన్ కంటే రెండింతల అధికంగా ఉండనుంది.
చాట్‌జీపీటీ గో ఉచిత సభ్యత్వాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
స్టెప్ 1: ముందుగా https://chat.openai.comలో చాట్‌జీపీటీ గో వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2: మీ ఓపెన్ఏఐ ఖాతాతో లాగిన్ అవ్వండి.
స్టెప్ 3: మీరు “చాట్‌జీపీటీ గో– భారతదేశ యూజర్లకు ఉచితం” ఎంపికను చూస్తారు.
స్టెప్ 4: దానిపై క్లిక్ చేసి, “ఉచిత సభ్యత్వాన్ని యాక్టివేట్ చేయండి” ఎంచుకోండి. ఇప్పుడు మీరు ఎలాంటి రుసుము చెల్లించకుండానే అన్ని చాట్‌జీపీటీ గో ఫీచర్‌లను యుపయోగించవచ్చు.
ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు?
ఈ ఆఫర్ ఇండియాలో లక్షలాది విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ కక్రియేటర్లు, చిన్న వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాదు, ఇమెయిల్‌లు రాయడం, కంటెంట్‌ను క్రియేట్ చేయడం, కోడింగ్ చేయడం లేదా బిజినెస్ ఐడియాస్ ప్లాన్ చేయడం వంటివి అయినా చాట్‌జీపీటీ తో పైసా ఖర్చు లేకుండా ఉపయోగించవచ్చు.


