Pan Card VS Pan 2.0: దేశంలోని పన్ను చెల్లింపుదారులందరికీ మరింత సులభమైన, సురక్షితమైన సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2024లో PAN 2.0 ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కొత్త పాన్ వ్యవస్థ పేపర్‌లెస్ విధానంతో పనిచేస్తూ, యూనిఫైడ్ పోర్టల్ ద్వారా అన్ని సేవల్ని ఒకే చోట తీసుకొస్తుంది. పాన్ సంఖ్య పొందడం నుంచి అప్డేట్‌లు, సవరణల వరకూ అన్నీ ఇకపై ఒకే వేదికపై పూర్తి చేయవచ్చు.
QR కోడ్ రీడర్ యాప్…
PAN 2.0లో ముఖ్యమైన మార్పులలో ప్రధానమైనది డైనమిక్ QR కోడ్. ఇప్పటికే 2017 నుంచి జారీ అవుతున్న పాన్ కార్డులపై QR కోడ్ ఉండగా, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులో ఆ కోడ్ మరింత కొత్తగా తీర్చిదిద్దారు. దీనివల్ల పాన్ డేటాబేస్‌లో ఉన్న తాజా సమాచారం పాన్ కార్డ్ మీదనే చూడవచ్చు. దీంతో కార్డు ప్రామాణికతను చక్కగా ధృవీకరించవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన QR కోడ్ రీడర్ యాప్ ద్వారా స్కాన్ చేస్తే, హోల్డర్ పేరు, ఫోటో, సంతకం, తల్లిదండ్రుల పేర్లు, జన్మతేది వంటి వివరాలు కనిపిస్తాయి.
అది అవసరం లేదు…
ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్ల విషయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 2017 తర్వాత జారీ అయిన పాన్ కార్డులలో ఇప్పటికే QR కోడ్ ఉండడంతో అవి చెల్లుబాటులో కొనసాగుతాయని ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. QR కోడ్ లేని పాత పాన్ కార్డులు ఉన్నవారికీ సమస్యేమీ ఉండదు.
Also Read: https://teluguprabha.net/business/it-refund-credited-in-4-hours-after-return-filing-in-india/
ఒకే వేదికపై అందుబాటులో…
పాన్ 2.0లో మరొక ముఖ్యమైన అంశం, ఇది పాన్ సేవల నాణ్యతను మెరుగుపరచేలా రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాన్, ట్యాన్ సంబంధించిన అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఆన్‌లైన్‌లోనే పాన్ ధృవీకరణ చేసుకోవచ్చు.
పార్లమెంటులో సాకేత్ గోఖలే అనే సభ్యుడు పాత పాన్ కార్డులపై QR కోడ్ అమలయిన సంవత్సరం, కొత్త పాన్ జారీ ప్రక్రియల మీద పలు వివరాలు కోరారు. కేంద్రం సమాధానంగా 2017 నుంచి QR కోడ్ ఉండే పాన్ కార్డులు జారీ అవుతున్నాయనీ, PAN 2.0 కాంట్రాక్ట్ ఇంకా ఎవరికి ఇవ్వలేదనీ వెల్లడించింది.
కేంద్ర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం, PAN 2.0లో ఉన్న డైనమిక్ QR కోడ్ ద్వారా పాన్ కార్డు వివరాల ధృవీకరణ మరింత వేగంగా జరుగుతుంది. పాత పాన్ కార్డులకు ఇది అవసరం కానప్పటికీ, భద్రతా దృష్టితో కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
PAN 2.0 ప్రారంభం తర్వాత పాన్ సమాచారంలో ఏదైనా మార్పులు ఉంటే …అంటే ఉదాహరణకు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఇమెయిల్, పుట్టిన తేది వంటి వాటిలో ఏమైనా మార్పులు ఉంటే కనుక వాటిని ఉచితంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ ఆధారిత అప్డేట్ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది.
Also Read:https://teluguprabha.net/business/upi-credit-card-and-lpg-rules-changing-from-august-1-2025/
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ PANలు ఉండకూడదు. ఇలా ఉంటే రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ PANలు ఉన్నవారు వాటిని వెంటనే అధికారులను సంప్రదించి రద్దు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంతకీ, పాన్ 2.0 గురించి ప్రజలు తరచూ అడిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు ఇలా ఉన్నాయి:
ఇప్పటికే పాన్ ఉన్నవారు కొత్త పాన్ కోసం దరఖాస్తు చేయాలా?
చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పాన్ నంబర్లు అలాగే కొనసాగుతాయి.
వివరాల్లో మార్పులు చేయాలంటే?
ఇమెయిల్, మొబైల్, చిరునామా వంటి వివరాలను ఉచితంగా మార్చుకోవచ్చు.
QR కోడ్ లేని పాత కార్డులు పనిచేస్తాయా?
అవును. అవి చెల్లుబాటులో ఉంటాయి. కావాలంటే కొత్త కార్డు దరఖాస్తు చేయవచ్చు.
యూనిఫైడ్ పోర్టల్ అంటే ఏమిటి?
పాన్, ట్యాన్ సేవలన్నీ ఒకే వేదికపై నిర్వహించే కొత్త సిస్టమ్.
ఈ విధంగా పాన్ 2.0 ద్వారా కేంద్రం సేవలలో పారదర్శకత, వేగం, భద్రత మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాత పాన్ కార్డులకు ఏ విధంగా అయినా నష్టం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

