Persistent Systems : సాధారణంగా ఐటీ రంగం అనగానే మనకు గుర్తొచ్చేవి టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు. కానీ ఈసారి క్యూ3 ఫలితాల సీజన్ మాత్రం ఊహించని మలుపులు తీసుకుంది. కొత్త లేబర్ కోడ్స్, గ్రాట్యుటీ నిధుల సర్దుబాటు వంటి కారణాలతో టాప్ కంపెనీల లాభాలు పడిపోగా.. పర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రం ఐటీ సామ్రాజ్యంలో తన విజయకేతనాన్ని ఎగురవేసింది.
దిగ్గజాల తడబాటు.. టెక్ మహీంద్రా ఊరట
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో దిగ్గజ ఐటీ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉద్యోగుల కోసం భారీగా నిధులను వెచ్చించడంతో వాటి నికర లాభాలపై ప్రతికూల ప్రభావం పడింది.టీసీఎస్ లాభం 14 శాతం తగ్గింది.ఇన్ఫోసిస్ లాభం 2.2 శాతం క్షీణించింది.హెచ్‌సీఎల్ టెక్ లాభంలో 11.2 శాతం కోత పడింది.విప్రో 7 శాతం మేర లాభాలు తగ్గాయి. అయితే, టాప్-5లో టెక్ మహీంద్రా ఒక్కటే 14.1 శాతం వృద్ధిని నమోదు చేసి ఫర్వాలేదనిపించింది.
అంచనాలను మించిన ఫలితాలు
ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అసాధారణమైన పనితీరును కనబరిచింది. ఇతర కంపెనీల మాదిరిగానే ఈ సంస్థ కూడా కొత్త లేబర్ కోడ్స్ కోసం రూ. 89 కోట్లు వెచ్చించినప్పటికీ, తన లాభాలను మాత్రం తగ్గనివ్వలేదు.నికర లాభం ఏడాది క్రితం కంటే 17.8 శాతం పెరిగి రూ. 429.4 కోట్లుగా నమోదైంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 23.4 శాతం పెరిగి రూ. 3,778.2 కోట్లకు చేరింది.బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుండి ఏకంగా 29.3 శాతం ఆదాయ వృద్ధి లభించింది. అలాగే సాఫ్ట్‌వేర్, హై-టెక్ రంగాల్లో 14.7 శాతం వృద్ధిని సాధించింది.
ఐటీకి గుడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తుంటే (Layoffs), పర్సిస్టెంట్ మాత్రం భిన్నమైన బాటలో పయనిస్తోంది. ఈ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 487 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 26,711 కి చేరింది. గతేడాది కంటే సుమారు 2,770 మంది అదనపు సిబ్బందిని ఈ సంస్థ చేర్చుకోవడం విశేషం. ఇది కంపెనీ వద్ద ఉన్న భవిష్యత్ ప్రాజెక్టులకు మరియు వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
షేర్ హోల్డర్లకు డివిడెండ్ ధమాకా
మెరుగైన ఫలితాలతో పాటు ఇన్వెస్టర్లను ఖుషీ చేసేలా కంపెనీ బోర్డు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది.ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 22 మధ్యంతర డివిడెండ్.2026, జనవరి 27. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 98,600 కోట్ల మార్కు వద్ద ఉండగా, షేరు ధర రూ. 6,306 వద్ద స్థిరపడింది.
ఒకవైపు ఆర్థిక సవాళ్లు, మరోవైపు కొత్త నిబంధనల భారం ఉన్నా.. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కనబరిచిన పట్టుదల ఐటీ రంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దిగ్గజాలే చేతులెత్తేసిన చోట, మిడ్-టైర్ కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరినిస్తున్నాయని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

