Interest Rates :ఈ నెలలో మీ ఆర్థిక అవసరాల కోసం అప్పు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, అత్యధిక వడ్డీలకు అప్పుల వేటలో పడి కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ప్రముఖ బ్యాంకులన్నీ పోటీపడి మరీ బెస్ట్ పర్సనల్ లోన్ ఆఫర్‌లను గుప్పిస్తున్నాయి.
ఒకప్పుడు అత్యవసరం ఉంటే అధిక వడ్డీకి లోన్ తీసుకోవడమే మార్గం. కానీ, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాంటి ప్రభుత్వ దిగ్గజాలు, HDFC, ICICI వంటి ప్రైవేట్ బ్యాంకుల మధ్య నెలకొన్న రేట్ల యుద్ధం వల్ల, రుణగ్రహీతలకు తక్కువ వడ్డీకే అప్పు తీసుకునే అవకాశం లభిస్తోంది. తొందరపడకుండా, సరైన బ్యాంక్‌ను ఎంచుకుంటే వేలకు వేలు ఆదా చేసుకోవచ్చు.
ఎవరు బెస్ట్? ప్రభుత్వమా? ప్రైవేట్‌దా?
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐ (SBI) కేవలం 10.05% నుండి వడ్డీని ప్రారంభిస్తూ, ప్రభుత్వ బ్యాంకుల విభాగంలో ముందంజలో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (10.40%), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (10.75%) కూడా మంచి ఆప్షన్లు. అయితే, ఎస్బీఐలో ప్రాసెసింగ్ ఛార్జీలు లోన్ మొత్తాన్ని బట్టి రూ. 1,000 నుంచి రూ. 15,000 వరకు ఉండవచ్చు. ప్రైవేట్ రంగంలో మరింత తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ కేవలం 9.98% నుంచే వడ్డీని స్టార్ట్ చేసి, ప్రభుత్వ బ్యాంకుల కంటే తక్కువ రేటును ఆఫర్ చేస్తూ ఆకర్షిస్తోంది. కానీ, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు 5% వరకు ఉండే అవకాశం ఉంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా 9.99% నుండి వడ్డీని మొదలుపెడుతూ, రూ. 6,500 + జీఎస్టీ ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ (10.60% నుండి) రుణ మొత్తంలో 2% వరకు ప్రాసెసింగ్ ఫీజుతో బరిలో ఉంది.
తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నారనే తొందరపాటుతో లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే, కొన్ని బ్యాంకులు వడ్డీని తక్కువగా చూపించి, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో అధిక ఛార్జీలు వసూలు చేయవచ్చు (కోటక్ మహీంద్రాలో 5% వరకు ఫీజు ఉన్న విషయాన్ని గమనించాలి).
కాబట్టి, లోన్ తీసుకోవాలనుకునేవారు కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా, ప్రాసెసింగ్ ఫీజు, EMI మొత్తం మరియు ఇతర దాచిన ఛార్జీలను కూడా పోల్చి చూసుకుని, మీ అవసరానికి మరియు తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా ఉండే ఉత్తమమైన ఆఫర్‌ను ఎంచుకోవడం తెలివైన పని.

