Homeబిజినెస్National Pension System: పింఛనుతో పదిలం.. పొదుపుతో కోటీశ్వరం!

National Pension System: పింఛనుతో పదిలం.. పొదుపుతో కోటీశ్వరం!

National Pension System (NPS) Benefits: భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు సామాన్యుడి మదిలో మెదిలే మొదటి ప్రశ్న… ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఎలా? చేతిలో చిల్లిగవ్వ లేని రోజుల్లో ఆర్థిక భద్రత ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానంగా, ‘చిన్న మొత్తమే కోట్లకు పడగలెత్తుతుంది’ అంటూ భరోసా ఇస్తున్నారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మమత రోహిత్‌. కేవలం రోజుకు కొన్ని వందల రూపాయల పొదుపుతో, పదవీ విరమణ నాటికి కోట్లాది రూపాయల నిధిని ఎలా సమకూర్చుకోవచ్చు..? అసంఘటిత కార్మికుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తోంది..? జాతీయ పింఛను పథకం (NPS) పారదర్శకత ఎంత..? 

- Advertisement -

2047 లక్ష్యం – అందరికీ పింఛను భద్రత: మన దేశంలో సుమారు 46 కోట్ల మంది కార్మిక శక్తి ఉంటే, వారిలో కేవలం 17 కోట్ల మందికి మాత్రమే పింఛను ప్రయోజనాలు అందుతున్నాయని మమత రోహిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక అసమానతను తొలగించే లక్ష్యంతో, 2047 నాటికి దేశంలోని ప్రతి అసంఘటిత కార్మికుడినీ జాతీయ పింఛను పథకం (NPS) పరిధిలోకి తీసుకురావడమే తమ ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అటల్‌ పింఛను యోజన (APY), ఎన్‌పీఎస్‌ కింద 8 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, వారి ఆస్తుల విలువ రూ.15.56 లక్షల కోట్లకు చేరిందని, ఇది ఈ పథకాలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ALSO READ: https://teluguprabha.net/business/indian-stock-markets-in-positive-note-with-gst-boster-pill-sensex-nifty-on-rising-trend/

మహిళలు, కర్షకులే కేంద్రంగా కొత్త పథకాలు: సమాజానికి వెన్నెముకగా నిలుస్తున్న వ్యవసాయదారులు, మహిళలు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ నడుం బిగించింది. వారి కోసం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని మమత రోహిత్ వెల్లడించారు. ఇప్పటికే ప్రారంభించిన ‘ఎన్‌పీఎస్‌ జరూరీహై’ (విత్తన పొదుపు – పింఛను పంట) పథకం ద్వారా రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని పొదుపుగా మార్చుకుని, దాన్ని పింఛను నిధికి జమ చేసే వినూత్న అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా, ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య’ పథకం ద్వారా పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరు మీద ఖాతా తెరిచి, చిన్నప్పటి నుంచే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని ఆమె వివరించారు.

పారదర్శకతే మా బలం: ఎన్‌పీఎస్‌ నిధి నిర్వహణలో “నూరుశాతం పారదర్శకత” పాటిస్తున్నామని మమత రోహిత్ బల్లగుద్ది మరీ చెప్పారు. మొత్తం 16 కఠినమైన నియంత్రణల (రెగ్యులేషన్స్) మధ్య నిధుల నిర్వహణ జరుగుతుందని, ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఖాతాదారుల సొమ్మును అత్యంత భద్రమైన, అధిక రాబడినిచ్చే మార్గాలలో పెట్టుబడిగా పెడుతున్నామని, దీనిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు.

ALSO READ: https://teluguprabha.net/business/gold-rates-fell-after-gst-rates-cut-know-ap-tg-latest-rates/

ఉపసంహరణ నిబంధనలు – వయసు పెంచడంతో ప్రయోజనాలు: ఎన్‌పీఎస్‌లో చేరితే డబ్బులు సులభంగా వెనక్కి తీసుకోవడం కష్టమనే అపోహను ఆమె తొలగించారు. లాకిన్‌ పీరియడ్‌ తర్వాత పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణం, వైద్య అత్యవసరాల కోసం జమ అయిన మొత్తంలో 25 శాతం వరకు, మూడుసార్లు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా, పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా భావించకుండా, చాలా మంది ఆ తర్వాత కూడా పనిచేస్తున్న వాస్తవాన్ని గుర్తించి, ఈ పథకంలో చేరే వయసును 70 ఏళ్లకు, అలాగే నిధిని ఉపసంహరించుకునే గడువును 75 ఏళ్లకు పొడిగించామన్నారు. దీనివల్ల ఎక్కువ కాలం పాటు చక్రవడ్డీ ప్రయోజనం పొంది, పదవీ విరమణ నాటికి నిధి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. సిస్టమెటిక్‌ విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ (SWP) ద్వారా నెలనెలా క్రమం తప్పకుండా పింఛను పొందే సౌలభ్యం కూడా ఉందని తెలిపారు.

యువతలో అవగాహనే అసలు సవాల్: పింఛను పథకాలపై యువతలో సరైన అవగాహన లేకపోవడమే ప్రస్తుతం తమ ముందున్న పెద్ద సవాల్ అని మమత రోహిత్ అంగీకరించారు. యువత దీర్ఘకాలిక ప్రణాళికల కంటే తక్షణ ప్రయోజనాల (Instant Gains) వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే చిన్న వయసులో పొదుపు ప్రారంభిస్తే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి వారికి వివరిస్తున్నామని తెలిపారు. పుట్టిన వెంటనే ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య’ ఖాతాలో జమ చేసే చిన్న మొత్తం, 75 ఏళ్ల నాటికి కోట్లాది రూపాయల కార్పస్‌గా ఎలా మారుతుందో గణాంకాలతో సహా వివరిస్తూ, వారిని చైతన్యవంతం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News