Tata Sons Board: టాటా ట్రస్టులలో రతన్ టాటా మరణం తర్వాత ఏర్పడిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవటంతో.. ప్రస్తుతం ప్రభుత్వం జోక్యం చేసుకునే స్థితి ఏర్పడింది. అక్టోబర్ 9, 2024న రతన్ టాటా మరణం జరిగాక అతిపెద్ద వ్యాపార గ్రూప్ టాటా గ్రూప్‌లో అంతర్గత ఉద్రిక్తతలు పెంచింది. టాటా ట్రస్టులు టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారులుగా ఉండగా.. ఈ విభేదాలు కంపెనీ పాలన, పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ వారం ఢిల్లీలో ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రులు టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ట్రస్టీ డారియస్ ఖంబాటా వంటి ప్రముఖులతో సమావేశమై పరిష్కార మార్గాలు చర్చించనున్నారు. ఈ చర్చలో రెండు ప్రధాన అంశాలు.. ట్రస్టీల మధ్య విభేదాలను నియంత్రించి టాటా సన్స్ పనితీరులో అంతరాయం రాకుండా చూడడం అలాగే RBI నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన పబ్లిక్ లిస్టింగ్‌కు మార్గం సుగమం చేయడంపై చర్చలు జరిగాయి.
ఉద్రిక్తతలకు మూలం సెప్టెంబర్ 11, 2025న జరిగిన వివాదాస్పద టాటా ట్రస్టుల సమావేశమేనని తెలుస్తోంది. ఈ సమావేశంలో నామినీ డైరెక్టర్ల నియామకం, బోర్డు కార్యకలాపాలపై సమాచార పరిమితులు వంటి నియంత్రణ వ్యవస్థలపై ట్రస్టీల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. అనంతరం టాటా సన్స్ నామినీ డైరెక్టర్ విజయ్ సింగ్ తొలగించబడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆయన తొలగింపుకు నోయెల్ టాటా, శ్రీనివాసన్ వ్యతిరేకించగా.. మెహ్లి మిస్త్రీని బోర్డులో చేర్చే ప్రతిపాదనకు మరికొంతమంది ట్రస్టీలు మద్దతు తెలిపారు. శ్రీనివాసన్‌పై కూడా పదవి తొలగింపు సూచనగా హెచ్చరిక ఇమెయిల్ ట్రస్టీలలో అవిశ్వాసాన్ని పెంచింది.
అలాగే.. గడచిన కొంతకాలంగా ట్రస్టీలు బోర్డు అజెండాలు, సమావేశ వివరాలు యాక్సెస్ చేయాలని, కీలక నిర్ణయాలకు ముందస్తు అనుమతి అవసరమని పట్టుబడుతున్నారు. కొందరు ట్రస్టీలు స్వతంత్ర డైరెక్టర్ల నియామకాన్ని, అలాగే గ్రూప్ కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమైన ట్రస్టీ పదవుల పునరుద్ధరణ సమయం దగ్గరపడడంతో ఈ అసంతృప్తి మరింతగా సభ్యుల మధ్య పెరిగిందని వెల్లడైంది.
టాటా సన్స్ రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు ‘ఉన్నత స్థాయి NBFC’గా వర్గీకరించబడిన మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పబ్లిక్ లిస్టింగ్ లేదా మినహాయింపు కీలక నిర్ణయ దశకు చేరుకుంది. ఈ క్రమంలో 18.37% వాటా కలిగి, భారీ అప్పుల్లో ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ లిక్విడిటీ కోసం లిస్టింగ్‌పై ఒత్తిడి పెంచుతోంది. ఈ సమీకరణలో టాటా ట్రస్టుల అంతర్గత విభేదాలను పరిష్కరించడం గ్రూప్ భవిష్యత్తుకు కీలకంగా మారిపోయింది. మెుత్తానికి టాటా ట్రస్ట్ లోపల ఏర్పడిన విబేధాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది బిజినెస్ సర్కిల్స్‌లో.


