Priya Nair HUL CEO: హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (HUL) తన 92 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ప్రియా నాయర్‌ను 2025 ఆగస్టు 1 నుంచి కొత్త CEO & MDగా నియమిస్తూ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం CEOగా ఉన్న రోహిత్ జవా 2025 జూలై 31న పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నిర్ణయంతో ప్రియా నాయర్ HULకు తొలి మహిళా సీఈఓ అయ్యే అవకాశం లభించింది. ఆమెకు అవసరమైన అనుమతులు లభించిన తర్వాత కంపెనీ బోర్డులో కూడా ఆమె చేరనున్నారు. అంతేకాకుండా యూనిలివర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (ULE) సభ్యురాలిగా కొనసాగనున్నారు.
యూనిలివర్‌లో 30 ఏళ్ల ప్రయాణం
ప్రియా నాయర్ 1995లో హిందుస్తాన్ యూనిలివర్‌లో చేరారు. తక్కువ స్థాయిలో పని ప్రారంభించి, కంపెనీలోని పలు విభాగాల్లో కీలక భూమికలు నిర్వహించారు. మొదట కన్‌జ్యూమర్ ఇన్‌సైట్స్ మేనేజర్, తర్వాత డోవ్, రిన్, కంఫర్ట్ వంటి ప్రధాన బ్రాండ్లకు బ్రాండ్ మేనేజర్‌గా పనిచేశారు. తర్వాతి కాలంలో లాండ్రీ వ్యాపార విభాగానికి మార్కెటింగ్ నేతృత్వం వహించగా, ఆపై డియోడరెంట్లు, ఓరల్ కేర్, కస్టమర్ డెవలప్‌మెంట్ విభాగాల బాధ్యతలు చేపట్టారు. వెస్ట్ ఇండియా కస్టమర్ డెవలప్‌మెంట్ జెనరల్ మేనేజర్‌గా, అనంతరం హోంకేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, దక్షిణాసియాలో బ్యూటీ & పర్సనల్ కేర్ విభాగానికి CCVPగా పని చేశారు.
గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు
భారత మార్కెట్‌లో ప్రియా నాయర్ చూపిన ప్రభావవంతమైన నాయకత్వం ఆమెను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. 2022లో యూనిలివర్ బ్యూటీ & వెల్‌బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2023లో అదే విభాగానికి ప్రెసిడెంట్‌గానూ పదోన్నతి పొందారు. ఈ విభాగం యూనిలివర్‌కి అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగాల్లో ఒకటి.
చదువు నేపథ్యం
ప్రియా నాయర్ ముంబైలోని సైదెన్హామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో B.Com (1987–1992) పూర్తి చేశారు. అనంతరం పుణెలోని సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి 1994లో మార్కెటింగ్‌లో MBA సాధించారు. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నారు.
ప్రభావవంతమైన నాయకత్వానికి గుర్తింపు
HUL చైర్మన్ నితిన్ పరాంజ్పే మాట్లాడుతూ, “ప్రియాకు భారత మార్కెట్‌పై విశేషమైన అవగాహన ఉంది. ఆమె విజయవంతమైన నాయకత్వం ద్వారా HUL మరింత ఎత్తుకు ఎదుగుతుందని నాకు నమ్మకం ఉంది,” అని తెలిపారు.
రోహిత్ జవా పదవీ విరమణ
రోహిత్ జవా 2023 నుంచి CEOగా పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో కంపెనీ వాల్యూమ్ ఆధారిత వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్లో సవాళ్లను అధిగమించడంలో కీలక పాత్ర వహించారు. ఇప్పుడు వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఆయన పదవిని వదిలి ఇతర అవకాశాలను అన్వేషించనున్నారు. ఈ సందర్భంగా ప్రియా నాయర్ నాయకత్వం ద్వారా భారత కార్పొరేట్ రంగంలో మహిళల దిశగా మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందనే అంచనాలు ఉన్నాయి.


