RBI big shock to Yes Bank: ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంకుతో పాటు హిందూజా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బిగ్ షాకిచ్చింది. కేవైసీ నిబంధనలకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ రెండు సంస్థలకు జరిమానా విధించింది. ప్రైవేట్ రంగ యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ రూ.31.80 లక్షల జరిమానా విధించింది. ఖాతాలు తెరిచే సమయంలో వినియోగదారుల కేవైసీ వివరాలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఐడెంటిఫైయర్‌ను ఉపయోగించే వ్యవస్థను యెస్ బ్యాంకు అమలు చేయలేదని ఆర్‌బీఐ ఆరోపించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై చేపట్టిన తనిఖీల్లో ఈ లోపాలను గుర్తించినట్టు స్పష్టం చేసింది. కెవైసీ విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, మోసాల నియంత్రణ, మనీ లాండరింగ్ నివారణకు కీలకంగా పనిచేస్తాయని తెలిపింది. వీటి అమలుపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇదే సమయంలో, నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన కారణంగా హిందూజా హౌసింగ్ ఫైనాన్స్‌పైనా ఆర్‌బీఐ రూ.1.8 లక్షల జరిమానా విధించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిందేనని, చిన్న లోపాలపైనా చర్యలు తప్పవని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలను ఆర్‌బీఐ హెచ్చరించింది.
Also read: https://teluguprabha.net/national-news/iuml-again-announces-support-for-vijay/

