Rbi new rules account claims within 15 days: మరణించిన ఖాతాధారుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు (డిపాజిట్లు), లాకర్లకు/సేఫ్‌లకు సంబంధించిన క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడానికి కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు మార్చి 31, 2026 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
క్లెయిమ్‌ల పరిష్కారానికి ఎంత గడువు?
మరణించిన కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా పరిష్కరించాలని, వారి నామినీకి నిధులను పంపిణీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కొత్త నిబంధనలను జారీ చేసింది. బ్యాంక్ ఆలస్యం చేస్తే నామినీకి కూడా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మరణించిన కస్టమర్ల క్లెయిమ్‌లను త్వరగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ నియమాలు రూపొందించింది. అంతేకాదు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని నిర్ణయించింది. ఈ నియమాలు మార్చి 31, 2026 నాటికి అమలులోకి వస్తాయని తెలిపింది.
ఈ నియమాలు వేటికి వర్తిస్తాయి?
ఈ నియమాలు మరణించిన వ్యక్తి డిపాజిట్ ఖాతాలు, సేఫ్ లాకర్లు, బ్యాంకులో ఉంచిన ఇతర సేఫ్‌లపై క్లెయిమ్‌లకు వర్తిస్తాయి. ఖాతాలో నామినీ లేదా సర్వైవర్‌షిప్ నిబంధన ఉంటే బ్యాంకు నామినీకి ఆయా మొత్తం అమౌంట్‌ను చెల్లించాలి. క్లెయిమ్ మొత్తం తక్కువగా ఉన్నట్లయితే అంటే సహకార బ్యాంకులకు రూ. 5 లక్షల వరకు, ఇతర బ్యాంకులకు రూ.15 లక్షల వరకు ఉంటే బ్యాంకు సరళీకృత విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అయితే,ఒకవేళ ఎక్కువగా ఉంటే బ్యాంకు వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టపరమైన పత్రాల ద్వారా క్లైయిమ్‌ను అభ్యర్థించవచ్చు.కాగా, మరణించిన వ్యక్తి లాకర్ లేదా సేఫ్టీపై దావాలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాంకు అవసరమైన అన్ని పత్రాలను స్వీకరించిన 15 రోజులలోపు దావాను పరిష్కరించాలి. అలాగే, నామినీతో సంప్రదించిన తర్వాత లాకర్‌ను తెరిచేందుకు తేదీని ప్రకటించాలి.
సెటిల్‌మెంట్ ఆలస్యమైతే ఏం జరుగుతుంది?
డిపాజిట్ ఖాతా క్లెయిమ్‌ల విషయంలో బ్యాంకు 15 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో విఫలమైతే, ఆలస్యానికి గల కారణాన్ని వివరించాలి. అలాగే ఆలస్య కాలానికి ప్రస్తుత బ్యాంకు వడ్డీ రేటుతో పాటు సంవత్సరానికి 4% చొప్పున సెటిల్‌మెంట్ మొత్తానికి వడ్డీని చెల్లించాలి. లాకర్ క్లెయిమ్‌లు – లాకర్ లేదా సేఫ్‌ను క్లెయిమ్ చేయడంలో ఆలస్యం జరిగితే బ్యాంకు ప్రతి రోజుకు రూ. 5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమాలు కస్టమర్లకు సౌకర్యాన్ని కోసం కల్పించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ కొత్త నిబంధనల ద్వారా మరణించిన వ్యక్తి ఖాతా లేదా లాకర్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు త్వరగా ప్రాసెస్ అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. నామినీలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ద్వారా ప్రక్రియను సులభతరం, పారదర్శకంగా చేయడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను రూపొందించింది.


