RBI New Rules for Loan Recovery Agents: బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో రుణాలు తీసుకుని అనివార్య కారణాల వల్ల సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోతున్న కస్టమర్లకు ఆర్‌బీఐ భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రుణ గ్రహీతల పట్ల కొన్ని బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు అనుసరిస్తున్న అమానవీయ, వినూత్న వేధింపుల పద్ధతులపై ఆర్‌బీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్, హోమ్, లేదా కార్ లోన్ల బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం వంటి డిజిటల్ వేధింపులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ హెచ్చరించింది. ఈ మేరకు రికవరీ ఏజెంట్లను నియంత్రించడానికి కఠినమైన మార్గదర్శకాలతో కూడిన సరికొత్త మాస్టర్ డైరెక్షన్ (ముసాయిదా)ను ఆర్‌బీఐ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు, రుణగ్రహీతల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Also read: Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమై.. చివరికి నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్..!
1. స్మార్ట్‌ఫోన్లను బ్లాక్ చేయవద్దు
సాధారణ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్, హోమ్, కార్ లోన్ల రికవరీ కోసం కస్టమర్ల వ్యక్తిగత ఫోన్లను టెక్నాలజీ ఆధారంగా బ్లాక్ చేసే హక్కు బ్యాంకులకు లేదు. అయితే, ఒకవేళ సదరు మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి సదరు బ్యాంకే ప్రత్యేకంగా లోన్ ఇచ్చి ఉంటే, అప్పుడు మాత్రమే దాన్ని బ్లాక్ చేయడానికి బ్యాంకుకు అనుమతి ఉంటుంది. అయితే, లోన్ ఈఎంఐ చెల్లించకుండా కస్టమర్ వరుసగా 90 రోజులు దాటిపోయి డిఫాల్ట్ జాబితాలోకి చేరిన తర్వాతే ఇలా చేసేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ నిబంధనల ప్రకారం, ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర ఎస్ఓఎస్ ఫీచర్లు, ప్రభుత్వ పబ్లిక్ సేఫ్టీ నోటిఫికేషన్లు వంటి అత్యవసర సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు.
2. ఆలస్యమైతే గంటకు రూ.250 జరిమానా
రుణగ్రహీత తన బకాయిలను లేదా లోన్ ఈఎంఐలను బ్యాంకుకు చెల్లించిన వెంటనే (గరిష్టంగా ఒక గంట వ్యవధి)లోపు సదరు మొబైల్ ఫోన్‌పై విధించిన అన్ని రకాల ఆంక్షలను బ్యాంకులు వెంటనే తొలగించాల్సి ఉంటుంది. లేదంటే సదరు బ్యాంకు కస్టమర్‌కు ప్రతి గంట ఆలస్యానికి రూ. 250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ప్రతిపాదించింది.
3. కస్టమర్లను బెదిరిస్తే కఠిన చర్యలు
కస్టమర్లను సామాజిక మాధ్యమాల ద్వారా అవమానించడం, బూతు పదజాలం ఉపయోగించడం వంటివి చేస్తే ఆర్బీఐ సీరియస్‌గా తీసుకుంది. కస్టమర్లను లేదా వారికి షూరిటీ ఉన్న హామీదారులను బెదిరించడం, భయపెట్టేలా మాట్లాడటం లేదా అసభ్య పదజాలంతో దూషించడం, సోషల్ మీడియాలో రుణగ్రహీతల ఆడియో, వీడియో రికార్డింగులు లేదా వారి వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేసి పరువు తీయడం వంటివి చేస్తే ఆయా బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది.
4. కాల్ రికార్డింగ్స్ మెయింటెయిన్ చేయాలి
భవిష్యత్తులో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, పారదర్శకత కోసం, బ్యాంక్ ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు కస్టమర్లకు చేసే ప్రతి కాల్ సమయం, కాల్స్ రికార్డింగ్‌ను బ్యాంకులు తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలి. కేవలం కాల్ డేటా మాత్రమే కాకుండా, ఆ కాల్స్‌లో ఏం మాట్లాడారనే కంటెంట్‌ను కూడా బ్యాంకులు భద్రపరచాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే థర్డ్ పార్టీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
నూతన నిబంధనల అమలు ఎప్పటినుంచి?
కాగా, ఈ సవరించిన కొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ ముసాయిదాపై స్టేక్‌హోల్డర్లు, బ్యాంకింగ్ నిపుణులు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను మే 31 వరకు కేంద్ర బ్యాంకుకు తెలియజేయవచ్చు. ఈ సరికొత్త నిబంధనలు కేవలం పెద్ద కమర్షియల్ బ్యాంకులకు మాత్రమే కాకుండా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, అన్ని రకాల ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు కూడా వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

