Cheque Clerance in 3 hours: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంటుంది. ప్రజలకు ఆర్థిక సేవలను అందించటం, వారి భద్రతతో పాటు సేవల్లో మెరుగుదలను నిర్థారించటం ఆర్బీఐ పని. వేగంగా బ్యాంకింగ్ వ్యవస్థను డిజిటలైజేషన్ చేస్తున్న రిజర్వు బ్యాంక్ ప్రస్తుతం చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని భారీగా తగ్గించేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చింది.
వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం ఖాతాదారులు తమ చెక్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తర్వాత క్లియరింగ్ పూర్తై డబ్బు జమ కావటానికి రెండురోజుల నుంచి మూడు రోజుల మధ్య సమయం పట్టేది. అయితే కొన్ని ప్రైవేటు బ్యాంకులు ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సమాచాన్ని ఒక్క రోజుకు తగ్గించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు అక్టోబర్ నెల నుంచి ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసిఐసిఐ ఈ విధానాన్ని స్టార్ట్ చేసింది. కానీ రిజర్వు బ్యాంక్ ఈ సమయాన్ని ప్రస్తుతం మరింతగా తగ్గిస్తూ కేవలం గంటల్లో క్లియరెన్స్ ప్రక్రియ వైపుకు మళ్లుతోంది.
జనవరి 3, 2026 నుంచి రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు చెక్ క్లియరెన్స్ ప్రక్రియను గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం ఎవరైనా వ్యక్తి తన ఖాతాలో చెక్ డిపాజిట్ చేసిన తర్వాత సదరు బ్యాంక్ దానిని 3 గంటల్లో పాస్ చేయటం లేదా రిజెక్ట్ చేయటాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అదే రోజున కస్టమర్ ఖాతాలో డబ్బు జమ చేయటం జరుగుతుంది.
కొత్త విధానం వల్ల చెక్ క్లియరెన్స్ సమయం రోజుల నుంచి గంటల్లోకి తగ్గిపోతుంది. ఇది వ్యాపారులతో పాటు సేవింగ్స్ ఖాతాలు కలిగిన వారికి వేగంగా నిధులు అందేలా చేస్తుంది. అలాగే సేవల్లో ఆలస్యాలు తగ్గి సౌకర్యవంతంగా చెక్ పేమెంట్స్ జరగటానికి రిజర్వు బ్యాంక్ చర్యలు దోహదపడనున్నాయి. అయితే చెక్ అందించే వ్యక్తులు మారిన రూల్స్ కి అనుగుణంగా తమ ఖాతాల్లో సరైన మెుత్తంలో నిధులు ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇది వారికి చెక్ బౌన్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే చట్టపరమైన చిక్కులకు దారితీయకుండా నివారిస్తుంది. దేశంలో వేగంగా జరుగుతున్న బ్యాంకింగ్ రంగంలోని మార్పుల గురించి ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం వారిని మోసాల నుంచి కాపాడటమే కాకుండా మెరుగైన సేవలు పొందటానికి వీలు కల్పిస్తుంది. చెక్ క్లియరెన్స్ కి సంబంధించిన వివరాల కోసం మీ సమీపంలోని బ్యాంక్ శాఖను సంప్రదించండి లేదా ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ www.rbi.org.in సందర్శించండి.


