Homeబిజినెస్Banking : రుణం తీరినా పత్రాల తిరకాసా?.. బ్యాంకుల నిర్లక్ష్యానికి ఆర్​బీఐ భారీ జరిమానా

Banking : రుణం తీరినా పత్రాల తిరకాసా?.. బ్యాంకుల నిర్లక్ష్యానికి ఆర్​బీఐ భారీ జరిమానా

RBI guidelines on home loan property documents return : చమటోడ్చి సంపాదించిన సొమ్ముతో సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రతి సామాన్యుడూ గృహ రుణంపై ఆధారపడతాడు. ఏళ్ల తరబడి పైసాపైసా కూడబెట్టి రుణం తీర్చేశాక, తాకట్టు పెట్టిన అసలు ఆస్తి పత్రాలు చేతికి వస్తేనే ఆ సంబరం పరిపూర్ణమవుతుంది. కానీ, తీరా అప్పు తీరిన తర్వాత బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పత్రాలు ఇవ్వకుండా కొర్రీలు పెడితే? బ్యాంకుల అలసత్వంతో పత్రాలు పోయినా, జాప్యం జరిగినా సామాన్యుడికి గుదిబండగా మారుతోంది. మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఖాతాదారులకు అండగా నిలిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? బాధితులకు దక్కే పరిహారం ఎంత?

- Advertisement -

30 రోజుల గడువు.. రోజుకు రూ.5,000 జరిమానా : రుణ ఖాతా పూర్తిగా మూతపడిన (క్లోజ్ అయిన) తేదీ నుంచి సరిగ్గా 30 రోజుల్లోగా అసలు ఆస్తి పత్రాలను రుణగ్రహీతకు అప్పగించాలని ఆర్​బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రీల్లో ఆస్తిపై ఉన్న ఛార్జీలను కూడా తొలగించాలి. నిర్దేశిత 30 రోజుల గడువు దాటితే, బ్యాంకుల అలసత్వానికి గానూ 31వ రోజు నుంచి ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున ఖాతాదారుడికి బ్యాంకే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ పత్రాలు పోతే? : బ్యాంకు నిర్లక్ష్యంతో ఒరిజినల్ పత్రాలు పోయినా లేదా పాడైనా చేతులెత్తేయడానికి వీల్లేదు. సంబంధిత డూప్లికేట్ లేదా సర్టిఫైడ్ కాపీలను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తెప్పించే బాధ్యత పూర్తిగా బ్యాంకుదే. పోలీసు ఫిర్యాదు, పత్రికా ప్రకటన తదితర ఖర్చులన్నీ బ్యాంకే భరించాలి. ఈ ప్రక్రియకు అదనంగా మరో 30 రోజులు (మొత్తం 60 రోజులు) సమయం ఉంటుంది. 60 రోజులు దాటితే మళ్లీ రోజుకు రూ.5,000 జరిమానా వర్తిస్తుంది.

పరిష్కారం ఇలా పొందండి: బ్యాంకు ఫిర్యాదుల విభాగం 30 రోజుల్లో స్పందించకపోతే ‘ఆర్​బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్’ (RB-IOS) ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి మానసిక వేదనకు అదనపు పరిహారం కోరవచ్చు. లోన్ తీసుకునేటప్పుడు సమర్పించిన పత్రాల లిస్ట్ (ఆక్నాలెడ్జ్‌మెంట్), స్కాన్ కాపీలను ముందే భద్రపరుచుకోవాలి. బ్యాంకుతో సంభాషణలన్నీ రాతపూర్వకంగానే సాగించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News