RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రియల్ ఎస్టేట్ రంగంలో ఓ సంచలనం సృష్టించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అత్యంత విలువైన ప్రాంతమైన సౌత్ ముంబై, నారిమన్ పాయింట్‌లో ఏకంగా రూ. 3,472 కోట్ల భారీ మొత్తంతో భూమిని కొనుగోలు చేసింది. ఇది దేశంలోనే అత్యంత భారీ భూ ఒప్పందాల్లో ఒకటిగా, మరియు ధర పరంగా రికార్డు స్థాయిలో నిలిచింది.
ఆర్‌బీఐ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన 4.61 ఎకరాల స్థలాన్ని ఈ రికార్డు ధరకు దక్కించుకుంది. అంటే, ఆర్‌బీఐ ఈ కొనుగోలుకు ఒక్కో ఎకరాకు రూ. 752.71 కోట్లు ఖర్చు చేసింది. రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా ప్రకారం, ఇది ధర పరంగా సరికొత్త రికార్డు. 1970ల ప్రారంభంలో ప్రధాన వాణిజ్య జోన్‌గా రూపుదిద్దుకున్న నారిమన్ పాయింట్‌లో ఒక భూమిని వేలం వేయడం (లేదా విక్రయించడం) ఇదే తొలిసారి కావడం విశేషం.
వాస్తవానికి ఈ స్థలాన్ని బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు దగ్గరగా ఉండటంతో మెట్రో రైల్ కార్పొరేషన్ వేలం వేయాలని భావించింది. అయితే, తన ప్రధాన కార్యాలయాన్ని విస్తరించాలని చూస్తున్న ఆర్‌బీఐ ఈ స్థలంపై ఆసక్తి చూపింది. దీంతో ముంబై మెట్రో రైల్ టెండర్‌ను రద్దు చేసి, ఆర్‌బీఐ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది.
సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ డేటా ప్రకారం, సెప్టెంబర్ 5న జరిగిన ఈ లావాదేవీ కోసం ఆర్‌బీఐ ఏకంగా రూ. 208.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది.ప్రస్తుతం దక్షిణ ముంబైలోని ఫోర్ట్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఆర్‌బీఐ, ఈ స్థలాన్ని సొంత కార్యాలయ వినియోగంతో పాటు వాణిజ్య ప్రయోజనాల కోసం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నది. ఈ తాజా కొనుగోలుతో ఆర్‌బీఐ తన స్థిరాస్తి ఆస్తులను మరింతగా విస్తరించుకుంది.
పాత రికార్డులు బద్దలు
ఆర్‌బీఐ కొనుగోలు ఇప్పుడు రికార్డుగా నిలిచినా, గతంలోనూ ముంబై రియల్ ఎస్టేట్‌లో భారీ ఒప్పందాలు జరిగాయి.2019లో సుమిటొమో కార్పొరేషన్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో (బీకేసీ) 3 ఎకరాల కోసం రూ. 2,238 కోట్లకు బిడ్ వేసింది. ఇది ఒక్కో ఎకరాకు రూ. 746 కోట్లుగా నమోదైంది.2010లో లోధా గ్రూప్ వడాలాలో 6.2 ఎకరాల కోసం రూ. 4,050 కోట్లకు బిడ్ వేసింది. ఇది మొత్తం విలువలో ఎక్కువైనా, ఎకరాకు రూ. 653 కోట్లుగా ఉంది.
ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలో ఆర్‌బీఐ చేసిన ఈ భారీ కొనుగోలు, వాణిజ్య భూముల విలువకు అద్దం పడుతోంది. నారిమన్ పాయింట్ ప్రాంతం మరింతగా వ్యాపార కేంద్రంగా బలపడటానికి ఇది నిదర్శనం.


