Home Price: భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసింది. అధిక డిమాండ్‌తో దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 7 శాతం నుంచి 19 శాతం వరకు గణనీయంగా పెరిగాయి.ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ముఖ్యంగా కొనుగోలుదారుల ఆసక్తి లగ్జరీ గృహాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాలపై కేంద్రీకృతం కావడంతో ధరల పరుగు మరింత వేగవంతమైంది.దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ధరల పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరలు ఏకంగా 19 శాతం పుంజుకున్నాయి. అధిక-నాణ్యత గల ప్రాజెక్టులు మరియు మెరుగైన కనెక్టివిటీకి గిరాకీ పెరగడంతో, ఇక్కడ గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ. 8,900కు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ. 7,479గా ఉండేది.
డబుల్ డిజిట్ గ్రోత్: బెంగళూరు, హైదరాబాద్ జోరు
సాంకేతిక నగరాలుగా పేరొందిన బెంగళూరు , హైదరాబాద్ కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.బెంగళూరులో ఇళ్ల ధరలు ఏకంగా 15 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ. 7,713 నుంచి రూ. 8,870కి ఎగబాకింది.హైదరాబాద్ మార్కెట్ కూడా అదే దూకుడును కొనసాగించింది. ఇక్కడ ధరలు 13 శాతం పెరిగి, చదరపు అడుగుకు రూ. 6,858 నుంచి రూ. 7,750కి చేరుకున్నాయి.సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అధిక ఆదాయాలు, విస్తృతమవుతున్న నగర మౌలిక వసతులు ఈ రెండు నగరాల రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
ఇతర నగరాల్లో స్థిరమైన వృద్ధి
దేశంలోని ఇతర ముఖ్య నగరాలు కూడా ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేశాయివ్యాపార రాజధాని ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) లో ఇళ్ల సగటు ధర చదరపు అడుగుకు రూ. 12,383 నుంచి రూ. 13,250కి పెరిగింది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.పూణేలో ఇళ్ల ధరలు 9 శాతం పుంజుకొని చదరపు అడుగుకు రూ. 7,250కి చేరాయి.
దక్షిణాన చెన్నై మార్కెట్ కూడా 9 శాతం వృద్ధిని చూసింది, సగటు ధర చదరపు అడుగుకు రూ. 7,173కి చేరింది.తూర్పున కోల్‌కతాలో ధరలు 8 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 6,060కి చేరుకున్నాయి. పశ్చిమాన అహ్మదాబాద్లో కూడా 7.9 శాతం వృద్ధి నమోదైంది. ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ. 4,820గా ఉంది.
సమర్థవంతమైన నగరీకరణ, స్థిరమైన ఉద్యోగాల సృష్టి, మరియు గృహ కొనుగోళ్లకు అనుకూలమైన వడ్డీ రేట్లు కారణంగా రియల్ ఎస్టేట్ రంగం ఉజ్వలంగా ముందుకు సాగుతోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, భారతీయులు ఇళ్ల కొనుగోలును సురక్షితమైన మరియు స్థిరమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారు, ఫలితంగా ఈ రంగం వృద్ధి మరింత వేగవంతమవుతోంది.


