Real Estate Price Hike: తెలంగాణ గృహ మార్కెట్ 2025 తొలి త్రైమాసికంలో మందగించింది. దేశంలోని టాప్ 7 నగరాలను చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి, సేల్స్ పడిపోయాయి. అనరాక్ (Anarock) రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ 2025 మధ్య కాలంలో హైదరాబాద్‌లో గృహ ధరలు సంవత్సరానికి సగటున 11 శాతం పెరిగాయి. అదే సమయంలో అమ్మకాలు గతంతో పోలిస్తే 27 శాతం తగ్గాయి. గతేడాది ఇదే కాలంలో 15,110 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి ఈ సంఖ్య 11,040కు పరిమితమైంది.
ఈ భారీ తగ్గుదలకు ప్రధాన కారణం ధరల పెరుగుదలే, ముఖ్యంగా నగరంలో గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడా, మియాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగుల మధ్య గృహ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, అధిక ధరలు ఉన్నాయి. ఈ కారణంగా మధ్య తరగతి మరియు ఫస్ట్ టైమ్ హోం బయ్యర్లకు ఈ మార్కెట్ సవాలుగా మారింది. దీంతో వారు కొత్త ప్రాపర్టీ కొనుగోలుపై వెనుకంజ వేస్తున్నారు. కాగా, ఈ దశలో భవిష్యత్ కొనుగోలు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, ఆర్థిక అస్థిరత కొనుగోలుదారుల్లో అప్రమత్తత పెంచాయి. దీంతో మార్కెట్‌లో అనిశ్చితి ఏర్పడింది.
ప్రాజెక్టుల ప్రారంభంలోనూ ఆలస్యం స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ అనుమతులు, మునిసిపల్ క్లియరెన్స్‌లు, RERA రిజిస్ట్రేషన్ వంటి విషయాల్లో జాప్యం వల్ల డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో వెనకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త ఇళ్ల సరఫరాలో కొరత ఏర్పడి, వినియోగదారులకు ఎంపికలపై పరిమితులు ఏర్పడుతున్నాయి. ఇది కూడా అమ్మకాల్లో తగ్గుదలకు మరో కారణం కావచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో రాబోయే త్రైమాసికాల్లో కొనుగోలుదారుల్లో మెరుగుదల ఉండే అవకాశముంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇదే విధమైన ట్రెండ్ కనిపించింది. ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లోనూ అమ్మకాల్లో తక్కువశాతం తగ్గుదల ఉండగా, హైదరాబాద్‌లో ఇది అత్యధికంగా నమోదైంది. చెన్నై నగరంలో మాత్రం మినహాయింపు కనిపించింది. అక్కడ అమ్మకాలు 11 శాతం మేర పెరిగాయి. ఇది అందుబాటులో గల హౌసింగ్ ప్రాజెక్టుల దృష్ట్యా సాధ్యమైందని నిపుణులు భావిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది తాత్కాలిక మందగమనంగా భావించవచ్చు. పండుగ సీజన్ ప్రారంభానికి ముందుగా మార్కెట్ మళ్లీ ఉత్సాహాన్ని పొందే అవకాశం ఉంది. స్టాక్ క్లియరెన్స్ ఆఫర్లు, ధరల స్థిరత, వడ్డీ రేట్లు తగ్గే సూచనలు మార్కెట్ పునరుజ్జీవనానికి దారితీయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులు మరియు డెవలపర్లు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. 2025 మూడవ త్రైమాసికం గృహ రంగానికి మళ్లీ పాజిటివ్ ట్రెండ్ తీసుకురావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నగరాల వారీగా గృహ విక్రయాలు
నగరం | అమ్మకాలు |
ముంబై (MMR) | 25% క్షీణత (41,540 → 31,275 యూనిట్లు) |
బెంగళూరు | 8% క్షీణత (16,440 → 15,120 యూనిట్లు) |
పుణే | 27% క్షీణత (21,100 → 15,410 యూనిట్లు) |
హైదరాబాద్ | 27% క్షీణత (15,110 → 11,040 యూనిట్లు) |
కోల్కతా | 23% క్షీణత (4,580 → 3,525 యూనిట్లు) |
చెన్నై | 11% వృద్ధి (5,100 → 5,660 యూనిట్లు) |