Saturday, November 15, 2025
Homeబిజినెస్Gold and Silver Prices: రయ్‌ మంటూ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు.. దీని వెనుక...

Gold and Silver Prices: రయ్‌ మంటూ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు.. దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసా?

Reasons Behind Gold and Silver Prices Hike: బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజు రోజుకూ రికార్డు ధర పలుకుతున్నాయి. సామాన్యుడికి అందనంత దూరంలో రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో తులం బంగారం ధర రూ.1.30 లక్షలకు పైమాటే. ఇక, బంగారంతో పోటీగా వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయనేది చాలా మందిలో సందేహం నెలకొంది. మన దేశంలో వీటి ధరలు పెరిగేందుకు దారితీసిన అంతర్జాతీయ, దేశీయ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

అంతర్జాతీయ కారణాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు నెలకొన్నాయి. వివిధ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, భారత్-పాక్‌ ఘర్షణల కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు. అందుకే, సురక్షితమైన బంగారం, వెండిని ఎంచుకుంటున్నారు. దీనివల్ల వాటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది.

కరెన్సీ విలువ పడిపోవడం

అమెరికాతో సహా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. దీని వల్ల కరెన్సీ విలువ పడిపోయింది. దీంతో తమ సంపదను కాపాడుకునేందుకు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. దీనివల్ల వాటి ధరలు పెరిగిపోతాయి.

డాలర్ విలువ పడిపోవడం

సాధారణంగా బంగారం ధరలను డాలర్లలోనే నిర్ణయిస్తారు. అయితే, డాలర్‌ విలువ తగ్గిన సమయంలో డాలరేతర కరెన్సీలు గల కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు చౌకగా మారుతాయి. చివరికి ఇది డిమాండ్‌ను పెంచుతుంది. దీనివల్ల వీటి ధరలు పెరుగుతాయి. అలాగే, ట్రంప్ సుంకాల విధానం కూడా ఈ ధరల పెరుగుదలకు దారితీశాయి.

సెంట్రల్ బ్యాంకుల ప్రభావం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ బ్యాంకులు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోళ్లు కూడా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అంతేకాదు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్‌ లాంటి పలు సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తాయనే అంచనాలు వచ్చినప్పుడు.. వడ్డీ ఇవ్వని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆకర్షితులైతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి.

దేశీయ అంశాల ప్రభావం

భారత్‌ బంగారాన్ని, వెండిని ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయిన క్రమంలో దిగుమతి ఖర్చు మరింత పెరిగి దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మరోవైపు, భారత్‌లో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పండుగ సమయాల్లో, శుభకార్యాల్లో బంగారాన్ని కొనడం సెంటిమెంట్‌గా భావిస్తారు. డిమాండ్‌ పెరగడం వల్ల ధరలు కూడా పెరిగిపోతాయి. అంతేకాదు, డిమాండ్‌కు తగ్గట్టుగా బంగారం, వెండి ఉత్పత్తి లేకపోవడం వల్ల అలాగే అంతర్జాతీయ సరఫరా గోలుసులో అంతరాయాలు రావడం వల్ల కూడా ధరలు పెరిగేందుకు కారణంగా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad