Reliance acquisition of Naturedge Beverages : దేశీయ పానీయాల మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) విభాగంలో దూసుకుపోతున్న ఆయన, ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ రంగంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ఆయుర్వేద మూలికలతో పానీయాలను తయారుచేసే ప్రముఖ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కంపెనీ ఏది..? ఈ ఒప్పందంతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి.?
‘షున్య’ బ్రాండ్‌తో భాగస్వామ్యం: రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఎఫ్‌ఎంసిజి విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యకరమైన ఫంక్షనల్ పానీయాల మార్కెట్‌లో ప్రవేశించేందుకు, నేచర్‌ఎడ్జ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌లోకి వెళ్లి, అందులో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు ఈ రోజు ప్రకటించింది.
నేచర్‌ఎడ్జ్ బేవరేజెస్ అనేది సుప్రసిద్ధ బైద్యనాథ్ గ్రూప్ వారసుడు, సిద్ధేష్ శర్మ 2018లో స్థాపించిన సంస్థ. ఈ కంపెనీ ‘షున్య’ (Shunya) అనే బ్రాండ్ పేరుతో ఆయుర్వేద మూలికలతో కూడిన ఫంక్షనల్ పానీయాలను విక్రయిస్తుంది. ఈ పానీయాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి పూర్తిగా జీరో-షుగర్, జీరో-క్యాలరీలతో, అశ్వగంధ, బ్రాహ్మి, ఖుస్, కోకుమ్, గ్రీన్ టీ వంటి సహజసిద్ధమైన మూలికలతో తయారు చేయబడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే యువతను, వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు.
రిలయన్స్ ప్రణాళిక ఇదే: ఈ ఒప్పందం ద్వారా, ‘షున్య’ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. తన విస్తారమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఈ ఆరోగ్యకరమైన పానీయాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురానుంది. “ఈ జాయింట్ వెంచర్ ఆయుర్వేదం స్ఫూర్తితో ఆరోగ్యకరమైన పానీయాలను మా పోర్ట్‌ఫోలియోలో చేర్చి, దానిని మరింత బలోపేతం చేస్తుంది” అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోడీ ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలోనే ‘షున్య’ ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులలో గణనీయమైన ప్రజాదరణ పొందిందని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో హెర్బల్-నేచురల్ ఫంక్షనల్ పానీయాల విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే శీతల పానీయాల విభాగంలో కాంపా (Campa), సోషియో (Sosyo), స్పోర్ట్స్ డ్రింక్ స్పినర్ (Spinner), పండ్ల ఆధారిత రస్కీక్ (RasKik) వంటి బ్రాండ్‌లతో రిలయన్స్ తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు ‘షున్య’ చేరికతో, పూర్తి స్థాయి పానీయాల కంపెనీగా మారాలనే రిలయన్స్ లక్ష్యం మరింత బలపడింది.
మార్కెట్ నిపుణుల అంచనా: మారుతున్న వినియోగదారుల జీవనశైలి, ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శ్రద్ధ కారణంగా, ఫంక్షనల్, ఆరోగ్యకరమైన పానీయాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ సమయంలో అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం, రిలయన్స్‌కు గేమ్-ఛేంజర్‌గా మారగలదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా కోకా-కోలా, పెప్సికో వంటి బడా కంపెనీలకు రిలయన్స్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.


