Reliance Consumer new Strategy : ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఏ రంగంలోకి అడుగుపెట్టినా, అది భారీ స్థాయిలోనే ఉంటుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్‌లో ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌ను శాసించేందుకు వ్యూహాత్మకంగా తన వ్యాపారాన్ని పలు మార్పులు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా “న్యూ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (New RCPL)” అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులను ఆకర్షించేలా, ఉత్పత్తుల నాణ్యత, ధరల పరంగా సవాలు విసిరేలా రూపుదిద్దుకుంటోంది.
వ్యూహం ఏమిటి?
రిలయన్స్ ఇప్పటికే నిర్వహిస్తున్న ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లు క్యాంపా కోలా, ఇండిపెండెన్స్, రావల్‌గావ్ మిఠాయి, సోసో, ఎస్‌ఐఎల్ వంటి బ్రాండ్‌లను ప్రత్యేకంగా ఒకే సంస్థ క్రింద ఒకతాటిపైకి తీసుకురావడం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశంగా ఉంది. అలాగే, తాజాగా వెల్వెట్ షాంపూ బ్రాండ్‌ను కూడా కంపెనీ కొనుగోలు చేసింది. మార్కెట్లో ప్రీమియం వాల్యుయేషన్ పొందాలంటే సంస్థకు ప్రత్యేకమైన ఆకారం అవసరమవుతుంది. ఈ మార్పులు రిలయన్స్ రిటైల్ విభాగానికి భవిష్యత్‌లో ఐపిఒకి మార్గం సుగమం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నాలుగు దశల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ
స్లంప్ సేల్ ద్వారా ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లు రిలయన్స్ రిటైల్ నుండి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)కు బదిలీ అవుతాయి. RRVL, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL)తో విలీనమవుతుంది. విలీన సంస్థను తీరా బ్యూటీ లిమిటెడ్‌కు బదిలీ చేసి దాన్ని “న్యూ ఆర్‌సీపీఎల్”గా కొత్త బ్రాండ్ ను సృష్టిస్తారు. ఈ కొత్త సంస్థ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, పంపిణీపై పూర్తిగా దృష్టిసారిస్తుంది.
మార్కెట్ లక్ష్యాలు
న్యూ ఆర్‌సీపీఎల్ లక్ష్యం కోకా కోలా, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి దిగ్గజాల కంటే 20-40% తక్కువ ధరలకే ఉత్పత్తులను అందించడం. 60 కోట్ల మందికి పైగా మాస్ కస్టమర్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటూ, కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద రిటైలర్లతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.
భవిష్యత్తు ప్రణాళికలు
ఆర్‌సీపీఎల్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ ప్రకారం, మార్చి 2027 నాటికి భారతదేశమంతటా ఎఫ్‌ఎంసీజీ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 2024-25 లో అంచనా వేసిన రూ.11,500 కోట్ల ఆదాయంలో, కిరాణా మరియు సాధారణ వాణిజ్యం ద్వారా 60%కి పైగా ఆదాయం వస్తోంది. ఇది కంపెనీ వ్యాపార సామర్థ్యాన్ని చాటుతోంది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టి) ఈ పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇచ్చింది. కార్పొరేట్ హామీలు, రుణ బాధ్యతలు తదితర వివరాలను అందించాలని పేర్కొంది. ఈ చర్యలు సంస్థ నైతిక విలువలను, పెట్టుబడిదారుల నమ్మకాన్ని మెరుగుపరుస్తాయి. న్యూ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూపకల్పనతో రిలయన్స్ ఎఫ్‌ఎంసీజీ రంగంలో భారీ అడుగు వేస్తోంది. భారత వినియోగదారుల అవసరాలను తక్కువ ధరలకు, అధిక నాణ్యతతో తీర్చేందుకు ఇది ఎంతో కీలకమైంది.