Reliance Jio IPO 2026:భారత స్టాక్ మార్కెట్ ముంగిట మరో మెగా సంచలనం నమోదు కావడానికి సిద్ధంగా ఉంది. ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీఓ (IPO) ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో, ఇప్పుడు దలాల్ స్ట్రీట్ చరిత్రను తిరగరాయడానికి సిద్ధమైంది.
రూ. 36 వేల కోట్ల వేట!
తాజా సమాచారం ప్రకారం, రిలయన్స్ జియో తన తొలి పబ్లిక్ ఇష్యూ ద్వారా 2.5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. దీని ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 36,000 కోట్లు) సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే గనుక జరిగితే, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ఐపీఓగా జియో నిలవనుంది.
Also Read: Budget 2026 – ఫిబ్రవరి 1 ఆదివారం రోజే యూనియన్ బడ్జెట్..
ఎందుకు ఇంత క్రేజ్?:
ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘జెఫ్రీస్’ అంచనా ప్రకారం జియో మార్కెట్ విలువ 180 బిలియన్ డాలర్లు. అయితే మరికొన్ని దిగ్గజ సంస్థలు దీని విలువ 200 నుండి 240 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని లెక్కగడుతున్నాయి.కేవలం 50 కోట్ల మంది యూజర్లతో టెలికాం దిగ్గజంగా ఉండటమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీల్లోకి జియో వేగంగా విస్తరించింది. అందుకే ఈ ఐపీఓ కోసం ముకేశ్ అంబానీ ఆచితూచి అడుగులేశారు.
మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు ఈ మెగా ఐపీఓ పత్రాల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఇది కొత్త షేర్ల జారీనా లేక పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించే ‘ఆఫర్ ఫర్ సేల్’ (OFS) రూపంలో ఉంటుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. గూగుల్, ఫేస్‌బుక్ (మెటా) వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఐపీఓ ద్వారా ఈ సంస్థలు భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.

