Reliance Jio Is Giving Google Gemini Ai Pro Subscription Free For All Its Users: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఎయిర్‌టెల్‌కు పోటీగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ జెమిని ఏఐ ప్రొ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, గతంలో ఈ ఆఫర్‌ను కేవలం యువతకు మాత్రమే అందిస్తున్నట్లు పేర్కొనగా.. ప్రస్తుతం ఈ ఆఫర్‌ను యూజర్లందరికీ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. జెమిని ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్‌ను ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.35,100 విలువ చేసే గూగుల్‌కు చెందిన అధునాతన ఏఐ మోడల్‌ను జియో ఫ్రీగా అందిస్తోంది. జియో అన్‌లిమిటెడ్ 5జీ యూజర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. గతంలో అక్టోబర్ 30 నుంచి ఈ ఆఫర్‌ను కేవలం యూత్‌కు మాత్రమే అందజేసింది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని వెల్లడించింది. కానీ 20 రోజుల తరువాత ఈ ఆఫర్‌ను అందరికీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా గూగుల్‌కు చెందిన కట్టింగ్ ఎడ్జ్ ఏఐ టూల్స్‌ను జియో యూజర్లందరూ ఉచితంగా వాడుకునే సౌలభ్యం ఉంటుంది.
రూ.35,100 విలువగల సబ్‌స్క్రిప్షన్ 18 నెలలు ఫ్రీ..
ఈ ఆఫర్‌ను 18 నెలల పాటు అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. దీన్ని తమ కస్టమర్లకు కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన పనులను కూడా ఏఐ సహాయంతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లకు ఉచితంగా 2 టీబీ గూగుల్ వన్ ప్రీమియం స్టోరేజ్ లభిస్తుందని, దీన్ని గూగుల్ డ్రైవ్, ఫొటోలు, జీమెయిల్, కంటెంట్ క్రియేషన్ కోసం వాడుకోవచ్చని తెలిపింది. యూజర్లు అధునాతన, హై క్వాలిటీ ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేసుకుని ఈ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఉచితంగా నానో బనానా, వీడియో జనరేటింగ్ టూల్స్..
ఈ ఆఫర్‌లో భాగంగా గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్ సహాయంతో యూజర్లు గూగుల్‌కు చెందిన నానో బనానా, వియో 3.1 వంటి ఇమేజ్, వీడియో జనరేటింగ్ టూల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. సాధారణంగా ఈ టూల్స్‌ను వాడుకోవాలంటే జెమిని ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్‌ను తీసుకోవాలి. దీనికి నెలకు సుమారుగా రూ.2 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో అందిస్తున్న ఈ ఆఫర్‌ను వాడుకుంటే ఈ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగానే పొందవచ్చు. ఇది 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. ఇక, ఈ ఆఫర్ పొందేందుకు గాను జియో యూజర్లు తమ ఫోన్‌లో ఉన్న మై జియో యాప్‌కు వెళ్లాలి. హోమ్ స్క్రీన్ పై భాగంలో ఉండే ఆఫర్‌పై ట్యాప్ చేయాలి. అనంతరం వచ్చే విండోలో క్లెయిమ్ నౌ అనే బ్యానర్‌పై టచ్ చేయాలి. దీంతో యూజర్లు ఇచ్చే మెయిల్ ఐడీకి ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. అనంతరం ఆ మెయిల్ ఐడీ సహాయంతో గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ అందిస్తున్న పర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్‌కు జియో అందిస్తున్న ఈ సబ్ స్క్రిప్షన్ గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

