EPFO Pension: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ 11 ఏళ్ల తర్వాత పెన్షన్‌దారులకు పెద్ద ఊరట ఇవ్వనున్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఉద్యోగుల పెన్షన్ పథకం(ఇపిఎస్-95) కింద కనీసం నెలసరి పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.2,500కి పెంచే ప్రతిపాదన గురించి పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇపిఎస్ కింద ప్రస్తుతం రూ.1,000 కనిష్ట పెన్షన్ 2014లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి దానిలో ఎలాంటి సవరణ జరగలేదు. ఈ క్రమంలో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటివి పెన్షనర్లపై భారీ భారంగా మారాయి. దీనివల్ల ఉద్యోగ సంఘాలు పలు మార్లు పెన్షన్ పెంపునకు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాయి. నెలకు రూ.1,000 పెన్షన్ తో జీవించడం అసాధ్యం అని, కనీసం రూ.7,500 వరకు పెంచాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే నివేదికల ప్రకారం ఇపీఎఫ్‌ఓ బోర్డు రూ.2,500 వరకు మాత్రమే పెంపును పరిశీలిస్తోందని సమాచారం. దీనిపై ఫైనల్ డెసిషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.
ఇపుఎస్ కింద కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసి, 58 ఏళ్ల వయస్సుకు చేరుకున్న ఉద్యోగులు నెలసరి పెన్షన్ అందుకోవటానికి అర్హులు అవుతారు. సర్వీస్ మధ్యలో ఉద్యోగం వదిలేసిన సభ్యులు తమ పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు లేదా తగ్గింపు పెన్షన్ కోసం ఆప్ట్ చేసుకోవచ్చు.
పెన్షన్ పెంపుతో పాటు పెట్టుబడి విధానాలు, డిజిటల్ సంస్కరణలు వంటి అంశాలపై కూడా బెంగళూరు సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రతిపాదన ఆమోదమైతే లక్షలాది పెన్షనర్లకు ఇది కొంత ఆర్థిక భరోసా కలిగించగలదనే ఆశలు రేకెత్తుతున్నాయి. 11 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద మార్పు రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి రాబోయే సీబీటీ సమావేశంపైనే కొనసాగుతోంది.

