Renault price cut: జీఎస్టీ స్లాబ్ రేట్లలో మార్పుల తర్వాత ప్రముఖ ఆటో దిగ్గజం.. రెనాల్ట్ ఇండియా తన కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించడంతో మార్కెట్‌లో పండగ అమ్మకాలపై మంచి హల్‌చల్ నెలకొంది. ఎంట్రీ-లెవల్ కారు కొనుగోలుదారులకు దీని వల్ల భారీ ప్రయోజనం చేకూరనుంది. రెనాల్ట్ కార్లపై గరిష్ఠంగా రూ.96,395 వరకూ తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఈ అఫిషియల్ ప్రైస్ కట్ సెప్టెంబర్ 22, 2025 నుంచే అన్ని డెలివరీలకు వర్తించనుంది. దీంతో ఇప్పటికే ముందస్తు బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
ఈ తగ్గింపులు ముఖ్యంగా రెనాల్ట్ క్విడ్, ట్రైబర్, కైగర్ మోడళ్లపై వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది. కైగర్ టాప్-ఎండ్ వేరియంట్లపై అత్యధికంగా రూ.96,395 తగ్గింపు దక్కనుంది. ఇక క్విడ్ ప్రారంభ ధర ఇప్పుడు కేవలం రూ.4.29 లక్షలు, ట్రైబర్, కైగర్ మోడళ్లు రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది కంపెనీ. ఈ ధర తగ్గింపుల ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన GST 2.0 నూతన నిబంధనల వల్ల తయారీదారులకు వచ్చిన ప్రయోజనాలను రెనాల్ట్ పూర్తిగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించటమే.
రానున్న నవరాత్రి, దీపావళి పండుగ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రైస్ కట్ అనౌన్స్ చేయడం విశేషం. కార్లు మరింత చౌక రేట్లకు అందుబాటులోకి రాగా.. మధ్యతరగతి కొత్త కారు కొనుగోలుదారులకు ఇదొక మంచి అవకాశంగా వచ్చిందంటున్నారు నిపుణులు. రెనాల్ట్ తాజా తగ్గింపులతో బ్రాండ్ కార్లు మరింత ‘విలువకు తగ్గ ధర’లో అందుబాటులోకి వస్తున్నాయి. మెుత్తానికి రెనాల్ట్ మార్కెట్లోని ఇతర ఆటో దిగ్గజాలతో పోటీపడేందుకు తన మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది.


