Gold Loan Rules Change: ఇకపై బంగారంపై రుణాలు తీసుకోవటంపై కొత్త షరతులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఏడాది చివర్లో వడ్డీ చెల్లించే సౌకర్యం ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఈ పద్ధతికి తెరదించాయి. గోల్డ్ లోన్ తీసుకున్న వారు ఇకపై ప్రతినెలా వడ్డీ తప్పనిసరిగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమలుకు సంస్థలు వస్తున్నాయి. ఇది డిఫాల్టర్ల సంఖ్య తగ్గించటంతో పాటు తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధుల కొరత ఏర్పడదని సంస్థలు బహుశా భావిస్తుండొచ్చు. పైగా బంగారం రేట్లు ఆకాశానికి తాకటంతో గతంలో కంటే ఎక్కువ రుణం డిస్పోస్ చేయాల్సి రావటం కూడా మరో కారణంగా తెలుస్తోంది.
ఇటీవలి నెలల్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దాంతో తక్కువ బంగారం పెట్టి ఎక్కువ రుణం పొందే అవకాశాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. బయట కనీసం రెండు రూపాయల నుంచి రూ.5 వరకు వడ్డీ డిమాండ్ చేస్తున్న సమయంలో కేవలం గోల్డ్ లోన్ 9 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బంగారం రుణాలు దేశవ్యాప్తంగా 26 శాతం మేర పెరిగాయి. అయితే ఈ రుణాలను గడువులోపు తిరిగి చెల్లించని వారి సంఖ్య క్రమంగా పెరగటం బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. గోల్డ్ లోన్ రంగంలో మొండి బకాయిలు 30 శాతానికి పైగా పెరగటంతో బ్యాంకులకు రికవరీ సవాలుగా మారుతోంది.
కొత్త విధానం ప్రకారం గోల్డ్ లోన్ తీసుకున్నవారు ప్రతినెలా వడ్డీ చెల్లించకపోతే అది నేరుగా వారి సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో ఇతర రుణాలు పొందడం కష్టతరమవుతుంది. ఈ నిర్ణయం కస్టమర్ల ఆర్థిక స్థోమతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదేనని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణ ప్రయోజనాలు సరైన రీతిలో వాడాలని ప్రజలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని అంటున్నారు. ఈ క్రమంలో గోల్డ్ లోన్ తులంపై రూ.లక్ష వరకు అందిస్తున్నాయి బ్యాంకులు.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రూ.2.50 లక్షల వరకూ రుణానికి బంగారం విలువలో 85 శాతం, రూ.5 లక్షల లోపు రుణాలకు 80 శాతం, ఆపైన రుణాలకు బంగారం విలువలో కేవలం 75 శాతం మాత్రమే రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం ఈ పరిమితిని మించి లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ప్రజలు ఖచ్చితంగా మారిన గోల్డ్ లోన్ రూల్స్ గురించి తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి.


