Indian rupee falls below 90 : భారత రూపాయి మరోసారి ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయంగా బలపడుతున్న డాలర్, పెరుగుతున్న ముడిచమురు ధరలు, దేశీయంగా కుదేలైన స్టాక్ మార్కెట్లు, విదేశీ నిధుల తరలింపు వంటి పలు ప్రతికూల అంశాల దెబ్బకు రూపాయి విలవిల్లాడింది. శుక్రవారం డాలర్తో పోలిస్తే ఏకంగా 26 పైసలు నష్టపోయి, కీలకమైన 90 మార్కును దాటి 90.16 వద్ద ముగిసింది. అసలు ఈ పతనానికి దారితీసిన కారణాలేంటి? రానున్న రోజుల్లో రూపాయి గతి ఏంటి?
ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో శుక్రవారం ఉదయం రూపాయి 89.88 వద్ద సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ, ఆ జోరును నిలబెట్టుకోలేకపోయింది. రోజు గడిచేకొద్దీ ఒత్తిడికి లోనై, ఒక దశలో 90.25 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి, క్రితం రోజు ముగింపు (89.90)తో పోలిస్తే 26 పైసలు నష్టపోయి, 90.16 వద్ద స్థిరపడింది.
పతనానికి పంచ కారణాలు : విశ్లేషకుల ప్రకారం, రూపాయి పతనానికి ప్రధానంగా ఐదు కారణాలు దోహదపడ్డాయి.
డాలర్ జోరు: ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్, 0.11% పెరిగి 99.04 వద్ద ట్రేడ్ అవ్వడం రూపాయిపై ఒత్తిడి పెంచింది.
చమురు మంటలు: అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 0.56% పెరిగి బ్యారెల్కు 62.34 డాలర్లకు చేరింది. ఇది రూపాయి పతనానికి ఆజ్యం పోసింది.
దేశీయ మార్కెట్ల కుంగుబాటు: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 604 పాయింట్లు నష్టపోయి 83,576 వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు కోల్పోయి 25,683 వద్ద ముగిశాయి. ఈ ప్రతికూల సెంటిమెంట్ రూపాయిని దెబ్బతీసింది.
విదేశీ నిధుల తరలింపు: విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs) దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగిస్తున్నారు. ఇది కూడా రూపాయిపై ఒత్తిడికి మరో కారణం.
అంతర్జాతీయ అనిశ్చితి: అమెరికా సుప్రీంకోర్టు సుంకాలపై ఇవ్వనున్న తీర్పు, అమెరికాలో వెలువడనున్న నాన్-ఫామ్ పేరోల్స్ నివేదిక వంటి అంశాలపై నెలకొన్న అనిశ్చితితో, మదుపరులు డాలర్ వైపు మొగ్గుచూపారు.
నిపుణులు ఏమంటున్నారు : ఈ పతనంపై ఫారెక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
“ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న రిస్క్-ఎవర్షన్, బలపడుతున్న డాలర్, పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా రూపాయి నెగెటివ్ బయాస్తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, దిగువ స్థాయిలలో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకుని రూపాయికి మద్దతు ఇవ్వవచ్చు.”
– అనూజ్ చౌధరి, రీసెర్చ్ అనలిస్ట్, మీరే అసెట్ షేర్ఖాన్
ఆయన అంచనా ప్రకారం, డాలర్-రూపాయి స్పాట్ ధర 89.90 నుంచి 90.60 శ్రేణిలో కదలాడవచ్చని తెలుస్తోంది.

