Rupee strengthens against dollar : భారత రూపాయి రెపరెపలాడింది. అమెరికా డాలర్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. కొంతకాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రూపాయి, బుధవారం నాటి ట్రేడింగ్‌లో అనూహ్యంగా పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 26 పైసలు లాభపడి, కీలకమైన 90 మార్కు దిగువకు చేరింది. అసలు రూపాయి ఇంతటి బలాన్ని పుంజుకోవడానికి దారితీసిన అంతర్జాతీయ పరిణామాలేంటి? ఈ సానుకూలత ఎంతకాలం కొనసాగవచ్చు?
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో బుధవారం ఉదయం రూపాయి ప్రస్థానం ఉత్సాహంగా ప్రారంభమైంది. 90.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి, అనతికాలంలోనే బలాన్ని పుంజుకుంది.ట్రేడింగ్ ఆరంభంలోనే, గత ముగింపుతో పోలిస్తే 26 పైసలు లాభపడి, 89.92 వద్ద ట్రేడ్ అవుతూ, ఇన్వెస్టర్లలో జోష్ నింపింది.
రూపాయి పరుగుకు.. రెండు ప్రధాన కారణాలు : రూపాయి ఇంతగా బలపడటానికి రెండు ప్రధాన అంతర్జాతీయ పరిణామాలు దోహదపడ్డాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పడిపోయిన ముడి చమురు ధరలు: అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, రూపాయికి కలిసొచ్చిన అతిపెద్ద అంశం. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.05% తగ్గి, బ్యారెల్‌కు $60.06 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. భారత్ తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ముడి చమురు ధరలు తగ్గితే, డాలర్లకు డిమాండ్ తగ్గి, సహజంగానే రూపాయి విలువ పెరుగుతుంది.
బలహీనపడిన డాలర్: ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే, అమెరికా డాలర్ బలహీనపడటం కూడా రూపాయి పరుగుకు దోహదపడింది. ఈ రెండు సానుకూల అంశాలు, రూపాయి విలువ ఒక్కసారిగా పైకి ఎగబాకడానికి కారణమయ్యాయి. ఈ పరిణామం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను తగ్గించి, దిగుమతి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి సహాయపడుతుందని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని అందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

