Apple COO Sabih Khan: భారత సంతతి వ్యక్తులు టెక్ కంపెనీల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే అనేక కంపెనీల్లో భారతీయుల ప్రతిభ హవా కొనసాగుతోంది. తాజాగా యాపిల్ కూాడా తన టీమ్ లోకి ఒక భారతీయుడిని కీలక పదవిలో నియమించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సబీహ్ ఖాన్‌ను యాపిల్ తన కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (COO) నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వహించిన జెఫ్ విలియమ్స్ పదవీ విరమణకు సిద్ధమవుతున్నారు.
భారతీయ మూలాలు
1966లో మోరాదాబాద్‌లోని చరిత్రాత్మక “మొహమ్మద్ యార్ ఖాన్ కోఠీ”లో సబీహ్ ఖాన్ జన్మించాడు. చిన్నతనంలో St. Mary’s Schoolలో చదివారు. ఆయన తండ్రి సయీద్ ఖాన్ ఒక ఇంజినీరుగా సింగపూర్‌కు మారిన తరువాత కుటుంబం అక్కడకు వెళ్లింది. ప్రస్తుతానికి సబీహ్ తన భార్య మరియు ముగ్గురు పిల్లలతో సాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు.
విద్యా ప్రస్థానం
సబీహ్ ఖాన్‌కు ఇంజినీరింగ్ మరియు ఎకానమిక్స్ రంగాల్లో బలమైన పునాది ఉంది. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ మరియు ఎకానమిక్స్‌లో బచిలర్ డిగ్రీలు పూర్తి చేశారు. అనంతరం Rensselaer Polytechnic Institute (RPI) నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
కెరీర్ ప్రారంభం నుండి యాపిల్ వరకు
సబీహ్ ఖాన్ తన కెరీర్‌ను GE Plasticsలో అప్లికేషన్స్ డెవలప్మెంట్ ఇంజినీర్ గా ప్రారంభించారు. అక్కడే కీలక ఖాతాదారుల టెక్నికల్ నిపుణుడిగా కూడా పనిచేశారు. 1995లో యాపిల్ లో చేరిన ఆయన, కంపెనీలో సుమారు 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు.
2019లో ఆయనను యాపిల్ ఆపరేషన్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అప్పటి నుంచి గ్లోబల్ సప్లై చైన్, ప్రోడక్ట్ క్వాలిటీ, తయారీ, లాజిస్టిక్స్, ప్రొక్యూర్‌మెంట్, ఫుల్‌ఫిల్మెంట్ వంటి కీలక బాధ్యతలు ఆయన చేపట్టారు.
ప్రస్తుతం బాధ్యతలు
ఈ నియామకం ఎప్పటి నుంచో యాపిల్ సిద్ధం చేసుకుంటున్న వారసత్వ ప్రణాళికలో భాగమే అయినా, ప్రస్తుత పరిస్థితులలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ యాపిల్‌ను అమెరికాలో తయారీ చేయాలన్న ఒత్తిడిని పెంచుతున్నారు. దీంతోపాటు Siri లో Generative AI ఫీచర్ల ఆలస్యమైన ప్రారంభం వల్ల వినియోగదారుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడం కోసం సరఫరా గొలుసు మీద ప్రత్యేక నైపుణ్యం కలిగిన సబీహ్ ఖాన్‌ను COOగా నియమించడమొక వ్యూహాత్మక నిర్ణయంగా చెబుతున్నారు.
టిమ్ కుక్ ప్రశంసలు
యాపిల్ CEO టిమ్ కుక్ మాట్లాడుతూ, సబీహ్ గ్లోబల్ సరఫరా గొలుసులో కీలక ఆర్కిటెక్ట్. ఆయన శ్రమ వల్ల తయారీ ప్రక్రియల్లో కొత్త సాంకేతికత ప్రవేశించడమే కాదు. అమెరికాలో తయారీ విస్తరణ సాధ్యమైంది. పర్యావరణ పరిరక్షణలో 60% కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన మనసుతోనూ, విలువలతోనూ నాయకత్వం వహిస్తారని కొనియాడారు.
కెటిఆర్ అభినందనలు
తెలంగాణ రాష్ట్రం మాజీ ఐటి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, యాపిల్ కొత్త COOగా పదోన్నతి పొందిన సబీహ్ ఖాన్‌కు హృదయపూర్వక అభినందనలు. గ్లోబల్ సప్లై చైన్‌ను నడిపే సమయంలో ఆయనను కలుసుకుని మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది. ముందుకు సాగిపో స్నేహితుడా, నీ విజయయాత్ర కొనసాగుతూనే ఉండాలని అన్నారు.


