SBI appeals to customers: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఎస్‌బీఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సమ్మె కారణంగా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ.. బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయంగా ఏంటీఎం, కస్టమర్ సర్వీస్ పాయింట్లు, యోనో, యూపీఐ వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో 52 కోట్ల మంది ఎస్‌బీఐ ఖాతాదారులపై ఈ ప్రభావం పడనుంది. ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23,200 ఎస్‌బీఐ బ్యాంక్ శాఖల్లో అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
Also read: TG POLYCET: బిగ్ అలర్ట్.. రేపే తెలంగాణ పాలిసెట్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి..!
బ్యాంకు సమ్మెతో 5 రోజులు సెలవులు..
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు తీర్చాలని ఎస్‌బీఐ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో సమ్మె నిర్వహిస్తామని ఆలిండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ఆధ్వర్యంలోని ఉద్యోగులు పేర్కొన్నారు. సరిపడా ఉద్యోగులు, మెసెంజర్లు, సాయుధ గార్డుల నియామకంతో పాటు ఎన్‌పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చడం వంటి ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. శాశ్వత ఉద్యోగాలను పొరుగు సేవలకు అప్పగించడాన్ని ఆపివేయాలని యూనియన్లు కోరుతున్నాయి. ఈ సమ్మె ప్రభావంతో వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. సమ్మెకు ముందు రోజులు నాలుగో శనివారం, ఆదివారం కావడం, మే 27న (బుధ) చాలా రాష్ట్రాల్లో బక్రీద్ సెలవు కావడంతో వరుస సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ తన కస్టమర్లను అలర్ట్ చేసింది.

