SBI Employes Announced strike: దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అఖిల భారత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్’ (AISBISF), ఈనెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుండటం, అలాగే ఫెడరేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడంలోనూ, అమలు చేయడంలోనూ ఎస్‌బీఐ యాజమాన్యం పదేపదే విఫలమవుతుండటంతో సమ్మె చేయక తప్పని పరిస్థితి తలెత్తిందని పేర్కొంది.
ఎస్‌బీఐలో తీవ్రమైన సిబ్బంది కొరత..
పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి తాము నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఉద్యోగులు, వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ పనితీరుపై ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని పేర్కొంది. ఆందోళన కార్యక్రమాలు, సమ్మె తప్పనిసరిగా మారే స్థాయికి ఉద్యోగులను నెట్టివేసిట్లు తెలిపింది. కాగా, గత కొన్నేళ్లుగా నియామకాలు తగ్గుముఖం పట్టడం వల్ల ఎస్‌బీఐ శాఖలన్నింటిలోనూ నెలకొన్న తీవ్రమైన సిబ్బంది కొరతను AISBISF తీవ్రంగా ఖండించింది. ఎస్‌బీఐలో ‘మెసెంజర్ల’ (సహాయక సిబ్బంది) నియామకాలు జరిగి దాదాపు 29 ఏళ్లు గడిచిపోయిందని, దీని ఫలితంగా బ్యాంక్‌లోని ‘సబార్డినేట్ కేడర్’ (దిగువ స్థాయి సిబ్బంది విభాగం) దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుందని వాపోయింది. ఫలితంగా, క్లరికల్ ఉద్యోగులు తమ సాధారణ బాధ్యతలతో పాటు ఇతర విధులను కూడా చేపట్టవలసి వస్తోందని, ఇది శాఖల్లో కార్యాచరణ సామర్థ్యం, వినియోగదారుల సేవ, పని పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలిపింది.
భద్రత, అవుట్‌సోర్సింగ్‌పై తీవ్ర ఆందోళనలు..
గత కొంత కాలంగా ఎస్‌బీఐలో నియామకాలు ఆశించిన మేర జరగకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ యువత దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉపాధి అవకాశాలను కోల్పోయారని, తద్వారా ప్రభుత్వ సామాజిక లక్ష్యం దెబ్బతిందని తెలిపింది. అందువల్ల, ఎస్‌బీఐ శాఖల్లో సాధారణ పనితీరును పునరుద్ధరించడానికి, వినియోగదారులకు సేవలను అందించడానికి.. సెక్యూరిటీ గార్డులు, క్లరికల్ సిబ్బందితో సహా అన్ని కేడర్‌లలో తక్షణ నియామకాలు చేపట్టాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. బ్యాంకులు, ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు, దాడులు, భద్రతాపరమైన ముప్పుల ఘటనలు పెరుగుతున్నప్పటికీ, సెక్యూరిటీ గార్డుల నియామకాలు జరగకపోవడంపై ఫెడరేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వినియోగదారులు, ఉద్యోగులు, ప్రజాధనం భద్రత రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని తేల్చి చెప్పింది. అందువల్ల, సెక్యూరిటీ గార్డులను రిక్రూట్ చేసుకోవాలని AISBISF డిమాండ్ చేస్తోంది. మరోవైపు బ్యాంకు, ఫెడరేషన్ మధ్య కుదిరిన ప్రస్తుత ఒప్పందాలు, అవగాహనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ, పర్మినెంట్ ఉద్యోగాల బదులు అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను తీసుకోవడాన్ని కూడా AISBISF తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాణిజ్య ఆర్థిక కార్యకలాపాలు, వ్యవసాయ అనుబంధ విధులు, భద్రతా సేవలకు సంబంధించిన కార్యకలాపాలను అవుట్‌సోర్సింగ్ చేయడం వల్ల ఉద్యోగ భద్రత, జవాబుదారీతనం, సేవా నాణ్యత, వినియోగదారుల గోప్యతపై ప్రతికూల ప్రభావం పడుతోందని హెచ్చరిస్తోంది.
ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, ఒత్తిడి..
అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా వినియోగదారుల డేటా రక్షణకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని, ఇది బ్యాంకు విశ్వసనీయత, సమగ్రత, సంస్థాగత స్వభావాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది. కీలకమైన, సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిరంతరం అవుట్‌సోర్సింగ్ చేయడం వలన పారిశ్రామిక సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఫెడరేషన్ హెచ్చరించింది. క్లరికల్ సిబ్బంది తీవ్ర కొరత కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగిందని, పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాల వల్ల ఏర్పడే ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులు పనివేళలకు మించి, సెలవు దినాల్లో కూడా పనిచేయవలసి వస్తోందని తెలిపింది. తగినంత మానవ వనరుల మద్దతు లేకుండా ఉద్యోగులపై అధిక పని ఒత్తిడిని, అవాస్తవిక వ్యాపార అంచనాలను రుద్దడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటువంటి పద్ధతులు ఉద్యోగుల శారీరక, మానసిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, బ్రాంచ్‌లలో కస్టమర్ సేవపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలిపింది.
పెండింగ్‌లోనే ఎన్‌పీఎస్, బదిలీ సమస్యలు..
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పిఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కోసం పింఛను నిధి నిర్వాహకులను ఎంచుకునే అవకాశాన్ని అమలు చేయాలని ఏఐఎస్‌బిఐఎస్‌ఎఫ్ కూడా డిమాండ్ చేస్తోంది. చట్టబద్ధమైన నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలాంటి మార్పులను అనుమతించినప్పటికీ, అనేక ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఉద్యోగుల మాదిరిగా కాకుండా ఎస్‌బీఐ ఉద్యోగులకు ఈ సౌకర్యం నిరాకరించబడం వల్ల ఉద్యోగులు, అధికారుల పదవీ విరమణ పొదుపు, ఆర్థిక భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపింది. 2019 నుండి నియమితులైన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ బదిలీ సౌకర్యాలను పునరుద్ధరించాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ మధ్య 2017 జులై 27న తేదీన కుదిరిన ఒప్పంద పత్రం (మెమోరాండం ఆఫ్ సెటిల్మెంట్) ప్రకారం ఇంటర్ సర్కిల్ బదిలీలకు అంగీకరించినప్పటికీ, 2019 నుండి నియమితులైన ఉద్యోగులకు బ్యాంక్ ఏకపక్షంగా ఈ సౌకర్యాన్ని నిలిపివేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు, మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు, కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్‌ను సమీక్షించాలని, మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను మెరుగుపరచాలని, పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, హెచ్‌ఆర్‌ఎంఎస్ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఎస్‌బిఐ బోర్డులో వర్క్‌మెన్ ఎంప్లాయీ డైరెక్టర్‌ను నియమించాలని, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టీలుగా ఉద్యోగుల ప్రతినిధులను నామినేట్ చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తూనే ఉంది. మరోవైపు, ఇన్సూరెన్స్, థర్డ్-పార్టీ ఉత్పత్తుల క్రాస్-సెల్లింగ్ పేరుతో ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడి పట్ల ఫెడరేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి తప్పుడు అమ్మకాలకు దారితీసి, వినియోగదారులకు ఇబ్బందులను కలిగిస్తూ, దశాబ్దాలుగా బ్యాంకు నిర్మించుకున్న విశ్వాసం, ప్రతిష్టను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపింది. నైతిక బ్యాంకింగ్ పద్ధతులు, వినియోగదారుల ప్రయోజనాలు, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలకు నష్టం కలిగేలా బ్యాంకింగ్ ఉద్యోగులను బలవంతపు అమ్మకాల ఒత్తిడికి గురిచేయకూడదని AISBISF పునరుద్ఘాటించింది.
ఇప్పటికే ప్రారంభమైన ఆందోళన కార్యక్రమాలు..
ప్రధాన డిమాండ్ల సాధన దిశగా, AISBISF ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. వీటిలో బ్యాడ్జీల ధారణ, భోజన విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలు, మౌన ధర్నాలు, ధర్నాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సోషల్ మీడియా ప్రచారాలు, అలాగే పార్లమెంటు సభ్యులకు, గౌరవ ఆర్థిక మంత్రికి, గౌరవ ప్రధాన మంత్రికి వినతిపత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలు చేపట్టింది. మే 25, 26 రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె ఉద్యోగుల సమస్యల పట్ల ఒక ప్రజాస్వామ్యబద్ధమైన, చట్టబద్ధమైన నిరసన వ్యక్తీకరణగా పేర్కొంది. ఉద్యోగుల నిజమైన సమస్యల పట్ల యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఈ సమ్మె ప్రతిభింబిస్తుందని తెలిపింది.
యాజమాన్యం తక్షణమే జోక్యం చేసుకోవాలని పిలుపు..
ఉద్యోగులు, వినియోగదారులు, నిరంతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఎస్‌బీఐ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, అర్థవంతమైన చర్చలను ప్రారంభించాలని ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఎటువంటి జాప్యం లేకుండా, చిత్తశుద్ధితో కూడిన, నిర్మాణాత్మకమైన, కాలపరిమితితో కూడిన ప్రయత్నాలు చేస్తే.. సమ్మె ప్రతిపాదన విరమించుకుంటామని స్పష్టం చేసింది. అయితే, సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే కొనసాగితే, సమ్మె చేసి తీరుతామని, దీని వల్ల తలెత్తే ఎలాంటి అంతరాయానికైనా పూర్తి బాధ్యత యాజమాన్యానిదే అని హెచ్చరించింది. ఎస్‌బీఐ ఉద్యోగుల హక్కులు కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ సమస్యలను ఐక్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరించే దిశగా ఫెడరేషన్ తన కృషిని కొనసాగిస్తుందని హామీ ఇచ్చింది.

