women empowerment : భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)… లింగ సమానత్వం (Gender Equality) వైపు భారీ అడుగు వేసింది. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్న SBI, రాబోయే ఐదేళ్లలో మొత్తం ఉద్యోగులలో మహిళల వాటాను 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం, బ్యాంక్ ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ, మొత్తం ఉద్యోగులలో వారి వాటా కేవలం 27 శాతం మాత్రమే ఉంది. ఈ శాతాన్ని పెంచి, సంస్థాగతంగా లింగ భేదాన్ని తగ్గించడానికి SBI కొన్ని కీలక పథకాలు మరియు రిజర్వేషన్లను అమలు చేయనుంది.
మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకాలు
మహిళా ఉద్యోగులకు కేవలం సంఖ్యాపరంగానే కాకుండా, వారి సౌకర్యం మరియు సంక్షేమం కోసం SBI అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది. పనిచేసే తల్లుల కోసం ‘క్రెచ్ అలవెన్స్’ (పిల్లల సంరక్షణ భత్యం) ఇవ్వనుంది. అలాగే, ప్రసూతి సెలవు తర్వాత తిరిగి విధుల్లో చేరే మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రొమ్ము , గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు.గర్భిణీ ఉద్యోగులకు పోషకాహార భత్యం (న్యూట్రిషన్ అలవెన్స్) అందించడం, మరియు గర్భాశయ క్యాన్సర్ టీకా (Cervical Cancer Vaccine) డ్రైవ్ నిర్వహించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది.ఈ చర్యల ద్వారా మహిళా ఉద్యోగులు తమ వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు మరింత సులభతరం అవుతుందని బ్యాంక్ భావిస్తోంది.
మహిళా శాఖల హవా పెరగనుంది
ఎస్‌బీఐ ఇప్పటికే మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా, ప్రస్తుతం 340కి పైగా శాఖలను మహిళా ఉద్యోగులే విజయవంతంగా నడుపుతున్నారు. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రత్యేక మహిళా శాఖల సంఖ్య కూడా మరింత విస్తరించనుంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా, SBI తీసుకున్న ఈ 30 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశంలోని ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. ఈ చర్య మహిళా సాధికారతకు మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది.


