SEBI Approves Rs 11000 Crore Zepto IPO: ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓకు సిద్ధమవుతోంది. జులైలో రూ. 11 వేల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. జులై 31లోపు ఐపీఓకు రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన ముసాయిదా పత్రాలను ఇప్పటికే సెబీకి జెప్టో యాజమాన్యం సమర్పించింది. పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు గతేడాది డిసెంబర్‌లోనే సెబీకి ముసాయిదా పత్రాలను జెప్టో సమర్పించింది. దీనివల్ల పోటీదారులకు మేలు చేకూర్చే సున్నిత సమాచారం రహస్యంగా ఉంటుంది. ఐపీఓ దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏమైనా అభ్యంతరాలుంటే సెబీ తెలియజేస్తుంది. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లను కంపెనీ మరోసారి సమర్పించాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే జెప్టోకు ప్రత్యర్థులైన బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేరెంట్ కంపెనీ స్విగ్గీ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Also read: Hamza Burhan: పాకిస్థాన్‌కు బిగ్‌షాక్.. పుల్వామా సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం..!
10 నిమిషాల్లోనే క్విక్ డెలివరీ సేవలు..
కాగా, 2020లో అదిత్ పలిచా, కైవల్య వోహ్రా అనే ఇద్దరు యువకులు కిరాణాకార్ట్ పేరుతో జెప్టోను స్థాపించారు. 45 నిమిషాల్లో క్విక్ డెలివరీ పేరుతో కొత్త రకమైన సేవలను ప్రారంభించారు. అనంతరం సొంతంగా డార్క్ స్టోర్లను నెలకొల్పి 10 నిమిషాల్లో డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అదే తర్వాతి కాలంలో జెప్టోగా మారింది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ పేరుతో మార్కెట్‌లో సంచనలం సృష్టించింది. తొలుత ముంబయిలో ప్రారంభమైన జెప్టో సేవలు.. ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాయి. దీంతో, క్విక్‌కామర్స్ సెగ్మెంట్‌లో అత్యధిక డార్క్ స్టోర్‌లు ఉన్న సంస్థగా జెప్టో నిలిచింది. జెప్టో ప్రస్తుతం దేశంలోని 61 నగరాల్లో 1,225 డార్క్ స్టోర్లను కలిగి ఉన్నట్లు బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టెయిన్ సంస్థ పేర్కొంది. నగరాల్లో సగటున 21 స్టోర్లను జెప్టో నిర్వహిస్తుండగా.. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటి పోటీ సంస్థలు 9 మాత్రమే నిర్వహిస్తున్నాయి. కాగా, జెప్టో షేరు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, మార్కెట్‌లో జెప్టోకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో కంపెనీ షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.

