SEBI cautions investors your money could be at risk in digital gold schemes: ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు ఆదరణ పెరిగింది. ఫిజికల్ గోల్డ్ రేట్లు అమాంతం పెరుగుతుండటంతో ఎక్కువ మంది డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, డిజిటల్ గోల్డ్ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సెబీ హెచ్చరిస్తోంది. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ప్రమోట్ చేసే డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులతో పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. ఈ ఉత్పత్తులు తమ పరిధిలోకి రావని, ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెబీ వెల్లడించింది. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సులభమైన మార్గంగా ‘డిజిటల్ గోల్డ్’ లేదా ‘ఈ-గోల్డ్’ను పేర్కొంది. అలాంటి, డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రిత గోల్డ్ పథకాల నుండి పూర్తిగా వేరు అని సెబీ స్పష్టం చేసింది. అవి సెక్యూరిటీలుగా భావించలేమని, కమోడిటీ డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ ట్రేడింగ్) కిందకు రావని స్పష్టం చేసింది. అవి సెబీ నియంత్రణ పరిధికి వెలుపల ఉన్నాయని తేల్చి చెప్పింది.
డిజిటల్ గోల్డ్‌కు సెబీ నో గ్యారెంటీ..
ఈ డిజిటల్ గోల్డ్ ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టడం వలన పెట్టుబడిదారులు గణనీయమైన నష్టాలకు గురయ్యే అవకాశం ఉందని సెబీ హెచ్చరించింది. సెబీ నియంత్రిత పెట్టుబడి ఉత్పత్తులకు వర్తించే పెట్టుబడిదారుల రక్షణ నిబంధనలు డిజిటల్ గోల్డ్ పథకాలకు వర్తించవని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు సెబీ నియంత్రిత ఎంపికల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. వీటిలో మ్యూచువల్ ఫండ్ల ద్వారా లభించే గోల్డ్ ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు), ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ అయ్యే కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టులు, స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, అమ్మకం చేయగల ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (ఈజీఆర్‌లు) ఉన్నాయని తెలిపింది. ఈ ఉత్పత్తులన్నింటిలో పెట్టుబడి పెట్టడానికి రిజిస్టర్డ్ మధ్యవర్తుల ద్వారా అనుమతి ఉందని, ఈ ఉత్పత్తులన్నీ సెబీ సూచించిన నియంత్రణ చట్రం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?
డిజిటల్ గోల్డ్ అనేది ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేసే ఒక సౌకర్యవంతమైన విధానం. కానీ, ఈ బంగారం వాస్తవానికి సురక్షితమైన ఖజానాలలో నిల్వ చేయలేము. మీరు దాన్ని తరువాత ఆభరణాలు లేదా బంగారు నాణేల రూపంలో తిరిగి పొందవచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. సేఫ్ గోల్డ్, క్యారెట్‌లేన్, తనిష్క్, ఎంఎంటీసీ పాంప్ వంటి వెబ్‌సైట్లు కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
నిబంధనలు-పన్నులు ఇవే..
అయితే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నోటిఫికేషన్ ప్రకారం, డిజిటల్ బంగారం ప్రస్తుతం, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. డిజిటల్ బంగారం జీఎస్టీ నిబంధనలకు లోబడి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని అమ్మితే, మూలధన లాభాల పన్ను, స్వల్పకాలిక లాభాల పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.


